
KTR: వీళ్లందరిలో ఈ కామన్ పాయింట్ గమనించారా?
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీలు.. మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, ఐబీఎం, ట్విటర్, మైక్రాన్, మాస్టర్ కార్డ్.. వీటిలో ఒక కామన్ పాయింట్ ఏమిటో గుర్తించారా? భారత్‌లో చదువుకుని ఎదిగిన వ్యక్తులే ఇప్పుడు ఈ కంపెనీ సీఈవోలుగా(ముఖ్య కార్యనిర్వహణాధికారులు) పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.. అంటూ మన దేశం నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వారిగురించి ట్విటర్లో పేర్కొన్నారు రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. సోమవారం ట్విటర్ కొత్త సీఈవో (ముఖ్య కార్యనిర్వహణాధికారి)గా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులైన సంగతి తెలిసిందే! ఈ సందర్భంగా కేటీఆర్.. ట్విటర్ వేదికగా పరాగ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈవోగా హైదరాబాద్‌కు చెందిన సత్య నాదెళ్ల పనిచేస్తున్నారు. గూగుల్ సీఈవోగా తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అడోబ్ సీఈఓగా హైదరాబాద్‌కి చెందిన శంతను నారాయణ్, ఐబీఎం సీఈవోగా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అరవింద్ కృష్ణ సేవలందిస్తున్నారు. మైక్రాన్ టెక్నాలజీ సీఈఓగా కాన్పుర్కి చెందిన సంజయ్ మెహ్రోత్రా పనిచేస్తున్నారు. పుణెకి చెందిన అజయ్ బంగా.. మాస్టర్ కార్డ్ భారత్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు.