Endemic Phase: మహమ్మారిలో.. ఎండెమిక్‌ దశ అంటే ఏంటి ?

ఎండెమిక్ అనే మాట చాన్నాళ్లుగానే వినిపిస్తోంది. ఇంతకీ ఎండెమిక్‌ దశ అంటే ఏంటి..? ఏ ప్రాతిపదికన దీన్ని నిర్ధరిస్తారు..?

Published : 17 Feb 2022 14:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎండెమిక్ అనే మాట చాన్నాళ్లుగానే వినిపిస్తోంది. ఈ పదానికి అర్థం ఒక ప్రాంతానికి పరిమితం కావడం. ఇంతకీ ఎండెమిక్‌ దశ అంటే ఏంటి..? ఏ ప్రాతిపదికన దీన్ని నిర్ధరిస్తారు..? ఇకపై ఎన్ని వేరియంట్లు వచ్చినా ప్రమాదముండదా..? ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇవే సందేహాలు..! గతంలో విజృంభించిన కొన్ని వైరస్‌లు.. ఇప్పుడు ఇదే దశకు చేరుకుని స్వల్ప ప్రభావాన్నే చూపుతున్నాయి. కరోనా వైరస్‌ కూడా దాదాపు ఇదే స్థితికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే..‌ ప్రజలపై ఆ ప్రభావం ఎలా ఉంటుందన్నది తేలాల్సిన అంశం. ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశమే లేదని నిపుణులు చెబుతున్నా.. అందుకు కారణమేంటన్నదీ తెలుసుకోవాల్సి ఉంది. సాధారణ జలుబులా మారుతుందని అంత కచ్చితంగా ఎలా చెబుతున్నారన్నదీ పరిశీలించాల్సిన అంశమే..!

ఎండెమిక్‌ దశ అంటే ఏంటి ?

పాండమిక్‌(మహమ్మారి)గా ప్రకటించిన వ్యాధి.. వ్యాప్తి చెందుతూ క్రమంగా ప్రభావం కోల్పోవడాన్ని ఎండెమిక్‌ దశ అంటారు. ఇది ఎంతకాలమైనా కొనసాగవచ్చు. ఉదాహరణకు.. కరోనాకు సంబంధించి ఈ రెండేళ్లలో అనేక దశలు వచ్చాయి. సుమారు 10 కొత్త వేరియంట్లను గుర్తించారు. వాటిలో డెల్టా లాంటి అత్యంత ప్రమాదకరమైన వేరియంట్లు.. లక్షలాది ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఇక లక్షలాది కేసులు వెలుగుచూసేందుకు ఒమిక్రాన్‌ కారణమైంది. డెల్టా వేరియంట్‌ నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపించింది. ఈ వేరియంట్‌ సోకిన వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురయ్యారు. అందుకే, రెండో వేవ్‌లో ఆక్సిజన్‌ సిలిండర్ల అవసరం ఏర్పడింది. పలు చోట్ల ఆక్సిజన్‌ లభించకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలా చూశాం. తర్వాత వచ్చిన ఒమిక్రాన్‌ ఎక్కువ ప్రభావం చూపకపోవడం ఊరటనిచ్చింది. ఈ వేరియంట్‌.. బాధితుల ముక్కులోనే ఉండిపోవడంతో మరణాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. టీకాలు సైతం చాలావరకు ప్రాణాలు కాపాడగలిగాయని నిపుణులు చెబుతున్నారు.

చెప్పుకోదగిన సంఖ్యలో దేశాలు.. కొవిడ్‌ కేసులను గణనీయ స్థాయిలో తగ్గించుకోగలిగితే.. మహమ్మారికి అధికారికంగా ముగింపు పడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటిస్తుంది. అయితే ఆ స్థాయికి చేరుకున్నా.. సరిపడా టీకాలు, చికిత్స మార్గాలు అందుబాటులో లేని అల్పాదాయ దేశాల్లో ఇక్కట్లు తప్పవు. కరోనాకు ముగింపు పలకడంపై ఈ సమయంలోనే ఎక్కువ శ్రద్ధ వహించాలని అంటువ్యాధుల నిపుణులు సూచిస్తున్నారు.

మహమ్మారి దశ ముగిశాక కరోనా వైరస్‌ వల్ల కొందరిలో జలుబు తలెత్తవచ్చు. మరికొందరిలో తీవ్ర అనారోగ్యం కలిగించొచ్చు. ఆయా వ్యక్తుల ఆరోగ్యం, టీకా తీసుకోవడం, గతంలో కరోనా బారిన పడటం లాంటి అంశాలపై పరిస్థితి ఆధారపడి ఉంటుంది. వైరస్‌లో ఉత్పరివర్తనాలు కొనసాగుతూనే ఉంటాయి. కరోనాను గుర్తించి.. ఎదుర్కోవడంలో మానవ రోగనిరోధక వ్యవస్థలు క్రమంగా మెరుగుపడతాయి. ఈ క్రమంలో బహుళ అంచెల రక్షణ వ్యవస్థలు ఏర్పడొచ్చు. ఈ అంచెల్లో ‘మెమరీ బీ’ కణాలు కూడా ఉన్నాయి. అవసరమైతే ఇవి రంగంలోకి దిగి.. మరిన్ని యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని టీకాలు ‘టీ హెల్పర్‌’ కణాలను పెంచుతాయని పరిశోధనలో తేలింది. వైరస్‌ ఉత్పరివర్తనం చెందినా ఇవి పనిచేసే వీలుంటుంది.

కొత్త వేరియంట్‌ వచ్చినా.. ఇదే పరిస్థితి కొనసాగొచ్చు. భవిష్యత్తులో కరోనా బారిన పడినవారు.. 2-3 రోజులపాటు ఇంటికి పరిమితమై, అనంతరం తమ పనుల్ని యథావిధిగా కొనసాగించే అవకాశం ఉండొచ్చని నిపుణుల అభిప్రాయం. సాధారణంగా కొన్ని వ్యాధులు కాలానుగుణంగా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమవుతాయి. అలాంటి వాటిని ఎండెమిక్‌ వ్యాధులుగా పిలుస్తారు. డెంగీ, మలేరియా, చికెన్‌ గునియా, సీజనల్‌ ఇన్‌ఫ్లూయెంజా లాంటి వ్యాధులు ఎండెమిక్‌ వ్యాధుల జాబితాలోకి వస్తాయి. ప్రస్తుతం ఇదే జాబితాలో కరోనా కూడా చేరిందని నిపుణుల అభిప్రాయం.   

డాక్టర్‌ గురుప్రసాద్‌.. జనరల్‌ ఫిజీషియన్‌

ఎండమిక్‌ అంటే.. వైరస్‌ ఉన్నప్పటికీ.. ఎక్కువ ప్రభావం చూపకపోవడమే. సాధారణ జలుబు మాదిరిగానే ప్రభావం చూపుతుంది. అయితే ఎండెమిక్‌ దశలోనూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిపై మాత్రం వైరస్‌ ఎక్కువ ప్రభావం చూపి ప్రాణాంతకంగా మారే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. అలాంటివారు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని