IBS: పేగుల్లో ‘గడబిడ’కు కళ్లెం... ఏం తినాలంటే?

పేగుల్లో గడబిడ.. ఇరిటబుల్‌ బవల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌). ఇదో దీర్ఘకాల సమస్య. దీని బారినపడితే కడుపునొప్పి,

Published : 31 Jan 2022 01:09 IST

పేగుల్లో గడబిడ.. ఇరిటబుల్‌ బవల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌). ఇదో దీర్ఘకాల సమస్య. దీని బారినపడితే కడుపునొప్పి, కడుపుబ్బరం, గ్యాస్‌, విరేచనాలు, మలబద్ధకం వంటివి తరచుగా వేధిస్తుంటాయి. ఇలాంటివారు ఆహారం విషయంలో.. ముఖ్యంగా అంతగా జీర్ణం కాని పిండి పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇలాంటి జీర్ణం కాని పిండి పదార్థాలు పేగుల్లోకి చేరినప్పుడు అక్కడి బ్యాక్టీరియా వాటితో రసాయనిక చర్యలు మొదలెడుతుంది. దీంతో గ్యాస్‌ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి కడుపునొప్పి, విరేచనాల వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఐబీఎస్‌ బాధితులు జీర్ణం కాని పిండి పదార్థాలను పరిమితంగా తీసుకోవటం మేలు. అలాంటి పదార్థాలేంటో, వాటికి ప్రత్యామ్నాయాలేంటో చూద్దాం.

పాలు: కొందరికి పాలలోని లాక్టోజ్‌ను విడగొట్టే లాక్టేజ్‌ స్థాయులు తక్కువగా ఉంటాయి. ఇలాంటివారికి పాలతో పాటు ఛీజ్‌ వంటి పాల ఉత్పత్తులు అంతగా పడవు. వీటిని కాస్త ఎక్కువగా తినగానే గ్యాస్‌ ఉత్పత్తి అయ్యి కడుపునొప్పి వంటివి బయలుదేరతాయి. కాబట్టి ఐబీఎస్‌ బాధితులు పాలు, పాల ఉత్పత్తులను పరిమితంగా తీసుకోవాలి. వీటికి బదులుగా సోయా పాల వంటివి తీసుకోవచ్చు.

పండ్లు: ఐబీఎస్‌ గలవారికి ఫ్రక్టోజ్‌ రకం చక్కెరతో లక్షణాలు పెరుగుతాయి. యాపిళ్లు, పుచ్చకాయ, ఎండు ఫలాల వంటి వాటిల్లో ఫ్రక్టోజ్‌ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఫ్రక్టోజ్‌ తక్కువగా ఉండే అరటిపండ్లు, ద్రాక్ష, నారింజ, స్ట్రాబెర్రీ వంటివి తీసుకోవచ్చు.

కూరగాయలు: కడుపులో గ్యాస్‌ ఉత్పత్తికి దోహదం చేసే క్యాబేజీ, గోబీపువ్వు, ఉల్లిగడ్డ వంటివి కడుపులో గడబిడకు దారితీస్తాయి. వీటికి బదులు వంకాయ, పాలకూర, క్యారట్‌, చిలగడదుంప, కందగడ్డ వంటివి తినటం మంచిది.

పప్పులు: బఠాణీలు, శనగలు, కందులు, సోయాబీన్స్‌ వంటి వాటిల్లో జీర్ణం కాని చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఐబీఎస్‌ లక్షణాలు పెరిగేలా చేస్తాయి. పప్పులకు ప్రత్యామ్నాయం లేకపోవచ్చు గానీ వీటికి బదులుగా ఓట్స్‌, చిరుధాన్యాలు, క్వినోవా, కర్రపెండలం వంటివి తీసుకోవచ్చు.

వీటికి తోడు కొవ్వు తక్కువగా గల ఆహారం తినటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం.. మద్యం, పొగ అలవాట్లకు దూరంగా ఉండటమూ మేలు చేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని