Samantha: సమంతకు వచ్చిన మయోసైటిస్‌ ప్రాణాంతకమా? తగ్గుతుందా? చికిత్స ఉందా?

మనపై వ్యాధులు దాడి చేయకుండా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ కాపు కాస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అదే వ్యవస్థ తిరిగి మన శరీరంపై దాడి చేస్తే...అదే ఆటో ఇమ్యూన్‌ సమస్య.

Updated : 30 Oct 2022 14:47 IST

ఆటో ఇమ్యూన్‌ ప్రభావంతోనే మయోసైటిస్‌ 

సినీనటి సమంత ప్రకటనతో ఈ వ్యాధిపై చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: మనపై వ్యాధులు దాడి చేయకుండా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ కాపు కాస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అదే వ్యవస్థ తిరిగి మన శరీరంపై దాడి చేస్తే...అదే ఆటో ఇమ్యూన్‌ సమస్య. దీంతో వచ్చేదే మయోసైటిస్‌ జబ్బు. ప్రముఖ సినీనటి సమంత కూడా మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసలు మయోసైటిస్‌ అంటే ఏమిటి? ఇది ప్రాణాంతకమా? తగ్గుతుందా? చికిత్స ఉందా? అనే ప్రశ్నలు చాలా మందిలో మెదులుతున్నాయి. మరి వైద్యనిపుణులు ఏం చెబుతున్నారంటే..

మయోసైటిస్‌ అంటే...

మయోసైటిస్‌నే పాలి మయోసైటిస్‌గా కూడా వ్యవహరిస్తారు. ఆటో ఇమ్యూన్‌ కారణంగా వచ్చే పాలి మయోసైటిస్‌ వల్ల భుజాలు, తుంటి వద్ద కండరాల క్షీణత ఉంటుంది. కూర్చుంటే పైకి లేవలేరు. ఇది ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. చిన్న పిల్లల్లో 5-15 ఏళ్ల వారికి, పెద్దవాళ్లలో 45-65 ఏళ్ల వారికి ఎక్కువ కన్పిస్తుంది. మహిళలే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు. చర్మానికి కూడా సమస్య వస్తే...దానిని డెర్మటో మయోసైటిస్‌ అంటారు. దీనివల్ల కనురెప్పలపై ఊదా, ఎర్రరంగు మచ్చలు ఏర్పడతాయి. కళ్లు ఉబ్బుతాయి. ఎండలోకి వెళ్తే ముఖం ఎర్రగా మారిపోతుంది.

వైరస్‌తోపాటు మందులతో వచ్చే మయోసైటిస్‌...

ఆటో ఇమ్యూన్‌తోపాటు వైరస్‌, కొన్ని మందుల ప్రభావంతోనూ మయోసైటిస్‌ వస్తుంది. వైరల్‌ మయోసైటిస్‌లో కండరాల నొప్పులు తీవ్రంగా ఉంటాయి. కదలించలేని పరిస్థితి ఏర్పడుతుంది. వైరస్‌ ప్రభావం తగ్గగానే తగ్గుతుంది. కొన్ని మందుల కారణంగా వచ్చే మయోసైటిస్‌...అవి ఆపేసిన వెంటనే తగ్గిపోతుంది.

ఎలా గుర్తించాలి?

కొన్ని బయోకెమిస్ట్రీ పరీక్షల ద్వారా మయోసైటిస్‌ను గుర్తిస్తారు. సాధారణంగా రక్తంలో క్రియాటిన్‌ ఇన్‌ ఫాస్పోకైనేజ్‌ (సీపీకె) స్థాయులు 150-200 వరకు ఉంటాయి. అదే మయోసైటిస్‌ రోగుల్లో వేలకు చేరతాయి. అంతేకాక మయోసైటిస్‌ సంబంధిత యాంటీబాడీలు కూడా పెరుగుతాయి. ఎలక్ట్రోమయోగ్రఫీ (ఈఎంజీ) పరీక్షతో కండర దృఢత్వాన్ని తెలుసుకొని వ్యాధిని అంచనా వేస్తారు.


100% చికిత్సలు అందుబాటులో ఉన్నాయి

మయోసైటిస్‌కు 100% చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వ్యాధిని గుర్తించగానే స్టెరాయిడ్స్‌, ఇమ్యూనిటీ మాడ్యులేటింగ్‌ మందులు, బయలాజికల్‌ ఔషధాలతో తగ్గుతుంది. కొందరికి ఇమ్యునోగ్లోబలిన్‌ (ఐవీఐజీ) చికిత్స అందించాలి. త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే మేలు. జాప్యం చేస్తే కొందరిలో ఊపిరితిత్తులపై ప్రభావం చూపి, పల్మనరీ పైబ్రోసిస్‌కు దారితీస్తుంది. ఒత్తిడి తగ్గించుకోవాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.

-డాక్టర్‌ శరత్‌చంద్రమౌళి, ప్రముఖ రుమటాలజిస్టు, కిమ్స్‌


కొన్నిసార్లు జీవితాంతం మందులు వాడాలి

వైరల్‌, కొన్ని రకాల మందుల వల్ల మయోసైటిస్‌లు వచ్చినా తర్వాత తగ్గిపోతాయి. ఆటోఇమ్యూన్‌ కారణంగా వచ్చే మయోసైటిస్‌కు కొన్నిసార్లు దీర్ఘకాలం మందులు వాడాలి. వ్యాధి జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు, వ్యాయామం లేకపోవడం..జంక్‌ఫుడ్స్‌తీసుకోవడం లాంటివి కారణం కావచ్చు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో సమతులాహారం, రోజూ గంట పాటు వ్యాయామం, తగినంత నిద్ర ఉంటే ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. 

-డా.ఎం.వి.రావు, ప్రముఖ ఫిజీషియన్‌, యశోద ఆసుపత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని