వర్షాకాలం: ఏవి తినొచ్చు.. ఏవి తినకూడదు!

వర్షాకాలంలో ప్రకృతి.. వర్షపు చినుకులు మనకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. దాంతోపాటు సీజనల్‌ వ్యాధులు కూడా వెంటాడుతుంటాయి. ఈ వర్షాకాలంలో సాధారణ రోజుల కంటే జాగ్రత్తగా ఉండాలని లేకపోతే అనారోగ్యానికి గురయ్యే అవకాశాలుంటాయి. అందుకే, ఈ సీజన్‌లో

Published : 25 Jul 2021 01:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వర్షాకాలంలో ప్రకృతి.. వర్షపు జల్లులు మనకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. దాంతోపాటు సీజనల్‌ వ్యాధులు కూడా వెంటాడుతుంటాయి. ఈ కాలంలో సాధారణ రోజుల్లో కంటే మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సీజనల్‌ వ్యాధులతో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలుంటాయి. మరి ఈ వర్షకాలంలో ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసుకుందామా..!

ఏవి తినకూడదు?

* వర్షం పడిందంటే వేడివేడిగా బజ్జీలు, సమోసాలు లేదా ఫ్రైడ్‌ ఫుడ్‌ తినాలని చాలా మంది కోరుకుంటారు. వీలు ఉంటే కచ్చితంగా వండుకొని తినేస్తారు. వాటిని మితంగా తింటే మంచిదే. కానీ ప్రకృతిని ఆస్వాదిస్తూ అతిగా తినేస్తే జీర్ణక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయి. విరేచనాలు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే, బజ్జీలు వంటివి చేసినప్పుడు అందుకు ఉపయోగించిన నూనెను మరో వంటకానికి వాడకండి. 

* వర్షాకాలంలో ఆకుకూరలను తినకుండా ఉంటే మేలు. ఎందుకంటే ఈ సీజన్‌లో ఆకుకూరల్లో బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటివి వచ్చి చేరే అవకాశముంది. ఒకవేళ ఆకుకూరలే వండాలనుకుంటే.. ముందుగా వాటిని బాగా కడగండి. ఎక్కువ సేపు ఉడకబెట్టండి.

* వర్షాకాలంలో చేపలు.. ఇతర సముద్ర జీవుల్లో పునరుత్పత్తి జరుగుతుంది. ఈ సమయంలో వాటిని తినడం అంత మంచిది కాదు. ఒకవేళ తింటే నీళ్ల ద్వారా వచ్చే వ్యాధులు, ఆహారం విషపూరితం అవడం వంటివి జరుగుతాయి. 

* బ్యాక్టీరియా, ఫంగస్‌ పెరుగుదలకు వర్షాకాలపు వాతావరణం అనువుగా ఉంటుంది. కాబట్టి అపరిశుభ్రంగా ఉండే ఏ చోటైనా అవి సులువుగా అభివృద్ధి చెందగలవు. అందుకే బయట అపరిశుభ్రంగా ఉండే చోట్ల ఆహారం తినకండి. కూల్‌డ్రింక్స్‌, చల్లటి పానీయాలు తాగకుండా ఉండటం మంచిది.

ఏవి తినొచ్చు..!

* ఈ సీజన్‌లో విటమిన్స్‌, పోషకాలు మెండుగా ఉండే పండ్లు తినాలి. ముఖ్యంగా ఈ సీజన్‌లో మాత్రమే లభించే చెర్రీ, దానిమ్మ, జామున్‌, ప్లమ్‌, ఆపిల్‌ పండ్లను తినడం వల్ల అవి మనల్ని అనారోగ్యంపాలు కాకుండా సహాయపడతాయి. అలాగే ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే కూరగాయాలు ఎక్కువగా తినాలి. ఏం వండినా చల్లారక ముందే వేడివేడిగా తినండి.

* వర్షాకాలం ప్రారంభంలో వాతావారణం కాస్తా వేడిగా ఉంటుంది. ఉక్కపోతతో శరీరంలోని లవణాలు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి వీలైనంత ఎక్కువ నీరు, సూప్‌, హెర్బల్‌ టీ వంటివి తాగుతూ శరీరంలో నీరు, లవణాల స్థాయిని సమతుల్యం చేసుకోవాలి. ఈ కాలంలో తాగు నీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నీళ్లని వేడి చేసుకొని తాగడం శ్రేయస్కరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని