Published : 27 May 2021 00:21 IST

CT Scan: కరోనా రోగికి ఎప్పుడు అవసరం?

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా కాలం మొదలయ్యాక సీటీ స్కాన్‌కు ప్రాధాన్యం బాగా పెరిగింది. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష కంటే ముందుగానే ఫలితం తెలిసిపోతోందన్న భరోసాతో చాలామంది, కరోనా అనుమానిత లక్షణాలు కనిపించగానే ల్యాబ్‌లకు వెళ్లి సీటీ స్కాన్‌ చేయించుకుంటున్నారు. కరోనా బారిన పడ్డాక వ్యాధి తీవ్రతను తెలుసుకోవడానికి కొంతమంది వారానికి ఒకసారి  చేయించుకుంటున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో అయితే సీటీ స్కాన్‌ చేయించిన తర్వాతే చేర్చుకుంటున్నారు. ఈ తరుణంలో వైరస్‌ నిర్ధారణకు సీటీ స్కాన్‌ చేయించుకోవడం మంచిదేనా? అందులో ఏం తెలుస్తుంది.. తదితర విషయాల గురించి వైద్యులు ఏమంటున్నారంటే..

కరోనా లక్షణాలు కనిపించగానే సీటీ స్కాన్‌ చేయించుకోవడం సరైనదేనా?

కుటుంబంలో ఎవరైనా కరోనా బారిన పడినా లేదా కరోనా లక్షణాలతో బాధపడుతున్నా వెంటనే కరోనా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలి. అయితే ఈ పరీక్షల్లో కొన్నిసార్లు నెగిటివ్‌ వచ్చే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో కంప్లీట్‌ బ్లడ్‌కౌంట్‌ (సీబీసి) టెస్టు చేయించుకోవాలి. దాని ద్వారా వైరల్‌ ఫీవర్స్‌ ఉంటే రక్తంలో లింఫోసైట్లు తక్కువగా ఉంటాయి. సెకండరీ ఇన్‌ఫెక్షన్‌ వస్తే వైట్‌సెల్ కౌంట్‌ ఎక్కువగా ఉంటుంది. చాలామందిలో కరోనా లక్షణాలు కొన్ని మాత్రమే కనిపిస్తుంటాయి. అలాంటివాళ్లు హోం ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుంది. వారికి సీటీ స్కాన్‌ అవసరం లేదు.

కరోనా రోగులకు సీటీస్కాన్‌ ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయకూడదు?

కరోనా లక్షణాలు కనిపించిన అయిదు రోజుల్లో సీటీస్కాన్‌ చేయించుకుంటే ఎలాంటి ఫలితం కనిపించదు. ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు చేయించిన తర్వాత నెగెటివ్‌ వచ్చి, లక్షణాల తీవ్రత తగ్గక పోయినప్పుడు సీటీ స్కాన్‌ అవసరం అవుతుంది. లక్షణాలు కనిపించగానే సీటీ స్కాన్‌ చేయించుకోమని ఇప్పటి వరకూ ఎవరూ చెప్పలేదు.

సీటీ స్కాన్‌ విధానం ఎలా ఉంటుంది? స్కాన్‌లో కనిపించే నంబర్లు, వాటి ప్రాధాన్యం ఏంటి?

కోరాయిడ్‌ స్కోర్‌ ఆధారంగా ఇన్‌ఫెక్షన్‌ను లెక్కిస్తారు. ఊపిరితిత్తుల్లో ఒకపక్క మూడు, ఒక పక్క రెండు.. మొత్తం అయిదు లోబ్స్‌ ఉంటాయి. ప్రతీ లంగ్‌ లోబ్‌లో ఎంతశాతం ఇన్‌ఫెక్షన్ ఉందనేది చూస్తారు. ఇన్‌ఫెక్షన్ స్థాయిని బట్టి స్కోర్‌ ఇస్తారు. 0 నుంచి 25 శాతం వరకూ ఇన్‌ఫెక్షన్ సోకితే 1 అని, 25 నుంచి 50 శాతం అయితే 2 అని.. ఇలా స్కోర్‌ ఇస్తారు.  ఊపిరితిత్తులు ఎంత వరకూ గాలిని పీల్చుకోగలవని తెలుసుకోవడానికి ఈ స్కోరింగ్‌ ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్ల వల్ల ఊపిరితిత్తుల నాళాలు మూసుకుపోవడం జరుగుతుంది. అలాంటప్పడు సీటీ స్కాన్‌ చేయించుకోవాలి. ఆక్సిజన్‌ లెవెల్స్‌ సాధారణంగా ఉండి ఒక్కసారిగా పడిపోతే, ఎందువల్ల అలా జరిగిందో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కోవిడ్‌ వైరస్‌ సోకినవాళ్లలో కొందరికి ఊపిరితిత్తులలో రక్తం గడ్డ కడుతుంది. అలాంటి సందర్భాల్లోనూ సీటీ స్కాన్‌ చేయాలి.

కరోనా నేపథ్యంలో సీటీ స్కాన్‌ గురించి ఎలాంటి అవగాహన ఉండాలి?

ఇంట్లో ఒకరికి కరోనా వస్తే అందరూ సీటీ స్కాన్‌ చేయించుకోవాల్సిన అవసరం లేదు. కరోనా లక్షణాల తీవ్రత, ఆక్సిజన్‌ స్థాయిని బట్టి సీటీ స్కాన్‌ అవసరమా లేదా అని వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఏ వైద్యుడూ సీటీ స్కాన్‌ను గాని, ఎక్స్‌-రే టెస్టును గాని మొదటి పరీక్షగా చేయరు. అత్యవసరమైతేనే సీటీ స్కాన్‌ చేస్తారు. సాధారణ లక్షణాలు కనిపించగానే వెంటనే సీటీ స్కాన్‌ చేయించుకోవాల్సిన అవసరం లేదు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని