500 రోజులుగా పాఠశాలల మూసివేత.. పూర్తి స్థాయిలో తెరచుకునేదెప్పుడో!?

స్కూళ్లు మూతపడి నేటికి సరిగ్గా 500 రోజులు అవుతోంది.  ప్రస్తుతం ఏయే రాష్ట్రాల్లో విద్యాసంస్థలు తెరచుకుంటున్నాయో చూద్దాం!

Published : 04 Aug 2021 01:37 IST

టీకాల పంపిణీతో ముడిపడ్డ పాఠశాలల ప్రారంభం

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో తిరిగి పాఠశాలల్ని తెరిచేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. రోజువారీ వైరస్‌ కేసులు గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతుండడంతో పెద్దలు కూడా పిల్లల్ని పాఠశాలలకు పంపించేందుకు ధైర్యం కూడగట్టుకుంటున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 25 కోట్లమంది పిల్లలు ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. గతేడాది మార్చి 16 నుంచి, ఇప్పటి వరకు 16 నెలలుగా పిల్లలు పాఠశాలల గడప తొక్కలేదు. స్కూళ్లు మూతపడి 500 రోజులు అవుతోంది. ప్రస్తుతం ఏయే రాష్ట్రాల్లో విద్యాసంస్థలు తెరచుకుంటున్నాయో చూద్దాం!

అన్నిటినీ తెరచి.. స్కూళ్లనే మూయడం ఎందుకు?
దేశంలో షాపింగ్‌ మాల్స్‌, సినిమాలు, ఫంక్షన్‌ హాళ్లు తెరిచారు. భారీ ఎత్తున పండుగలు, జాతరలు, ఊరేగింపులు, సామాజిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. అలాంటప్పడు పాఠశాలల్ని ఎందుకు తెరవట్లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తమ పిల్లలు చదువుల్లో చాలా వెనకబడి పోయారని, కేవలం ఆన్‌లైన్‌ తరగతులు వింటూ, ముందు తరగతికి ప్రమోట్‌ చేస్తుంటే ఎలాగని అడుగుతున్నారు. ఇలా స్కూళ్లను మూసివేయడం వల్ల చాలామంది పిల్లల చదువులు, ఆరోగ్యంపై  ప్రభావం చూపుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పలు రాష్ట్రాల్లో ప్రారంభమైన తరగతులు!
కొన్ని రాష్ట్రాలు ఈ ఏడాది జనవరిలో యాభై శాతం పిల్లలతో 9 నుంచి12 తరగతులకు పాఠశాలలు ప్రారంభించాయి. కానీ కరోనా రెండోదశ తీవ్రస్థాయికి చేరుకోవడంతో మూతపడ్డ పాఠశాలలు మళ్లీ  తెరచుకోలేదు. ఇటీవల చాలా రాష్ట్రాల్లో పాఠశాలల్ని తెరచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మనదేశంలో ఎక్కువ కేసులు వెలుగు చూసిన మహారాష్ట్రలో జులై 16 నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని సుమారు 6వేల పాఠశాలల్లో 8 నుంచి 12 వరకు తరగతులు మొదలయ్యాయి. గుజరాత్‌లోనూ కరోనా కేసులు లేని ప్రాంతాల్లో జులై 16 నుంచి ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు తరగతులు కొనసాగుతున్నాయి.  కాకపోతే పిల్లలు తరగతులకు రావాలంటే తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి.  మధ్యప్రదేశ్‌లోనూ జులై 26 నుంచి ఇంటర్‌ విద్యార్థులకు వారానికి రెండు రోజుల చొప్పున తరగతులు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 5 నుంచి 9, 10 తరగతులకు కూడా ఇదే పద్ధతిలో పాఠశాలలు మొదలవనున్నాయి. ఒడిశాలో 10 నుంచి 12 తరగతులవారికి జులై 26 నుంచి విద్యాసంస్థలు తెరచుకున్నాయి.  పంజాబ్‌లో ఆగస్టు 2 నుంచి అన్ని తరగతులకు పాఠశాలలు  ప్రారంభమయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోను ఆగస్టు 2 నుంచే 10-12 తరగతులకు పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. కానీ స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల అంగీకారంమేరకే పాఠశాలల్ని తెరుస్తున్నారు.  ఉత్తర ప్రదేశ్‌లో పది, ఆపై తరగతులకు 50 శాతం హాజరుతో ఆగస్టు 16 నుంచి విద్యాసంస్థలను తెరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ఆగస్టు 16 నుంచి తరగతుల్లో విద్యా బోధనకు ప్రభుత్వం ఆదేశించింది. గుజరాత్‌లో 9 నుంచి 12 క్లాసులవారికి జులై 26న విద్యాసంస్థలు తెరచుకున్నాయి. రోజు విడిచి రోజు 50 శాతం విద్యార్థులకు అనుమతిస్తున్నారు. గత జనవరిలో అక్కడ 45 శాతం హాజరు నమోదైన సంగతి గమనార్హం. హరియాణాలో జులై 16 నుంచే 9, 10 తరగతులకు పాఠశాలలు తెరచుకున్నాయి. ఇక భారీగా కరోనా కేసులు నమోదైన దిల్లీలో పాఠశాలల్ని తెరిచేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. తెలంగాణలో జులై 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు మొదలయ్యాయి. ఇంకా ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, తమిళనాడు, కేరళ, నాగాలాండ్‌, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో పాఠశాలల్ని మూసివేసే ఉంచారు. 

పెద్దల ఆందోళన.. నత్తనడకన టీకాల కార్యక్రమం!
కొన్ని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పుడప్పుడే పిల్లలకు పాఠశాలలు తెరవడం, పరీక్షలు పెట్టడంపై సుముఖంగా లేవు. ఎందుకంటే చాలామంది పిల్లలు, ఉపాధ్యాయులు కొవిడ్‌ బారిన పడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. చిన్నపిల్లల్ని బడులకు పంపించి ఇబ్బందులు కొని తెచ్చుకోలేమని తల్లిదండ్రులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా మరికొద్ది రోజులు వేచి చూస్తే మంచిదనే అభిప్రాయాన్నివారు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం దేశంలో దాదాపు అందరికీ కనీసం సింగిల్‌ డోస్‌ వ్యాక్సినేషన్ పూర్తయ్యాకనే పిల్లలను పాఠశాలకు పంపిస్తే బాగుంటుందని అంటున్నారు. ఉపాధ్యాయులందరికీ పూర్తి స్థాయిలో టీకాలు వేశాకనే స్కూళ్లను ప్రారంభించాలని అంటున్నారు.

చాలామందికి అందని ఆన్‌లైన్‌ విద్య!
దేశంలో నలుగురిలో ఒక్కరికే డిజిటల్‌ పరికరాలు, ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులో ఉందని మార్చి 2021లో యునిసెఫ్‌ విడుదల చేసిన నివేదిక తెలియజేస్తోంది. చాలా పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతుల ప్రసారానికి కూడా సదుపాయాలు లేవు. 12 శాతం ప్రభుత్వ పాఠశాలలకే ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉంది. 30 శాతం పాఠశాలల్లోనే కంప్యూటర్లు ఉన్నాయని గత ఏడాది సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ నివేదికే తెలియజేసింది. పైగా పిల్లల్లో కొవిడ్‌ ప్రాణాంతకంగా మారుతున్న సందర్భాలు చాలా తక్కువ కావడం వల్ల నిర్భయంగా పాఠశాలల్ని ప్రారభించవచ్చని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. కరోనా మూడో దశను గమనిస్తూ, ఒకవేళ కేసులు పెరిగితే మళ్లీ ఆన్‌లైన్‌ ద్వారానే క్లాసులు కొనసాగించవచ్చంటున్నారు.  కాబట్టి పరిస్థితులను బేరీజు వేసుకుంటూ, తిరిగి పాఠశాలలు ప్రారంభిస్తే మేలనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని