Updated : 19 Nov 2021 12:34 IST

Tirupati Floods: తిరునగరిలో వరద బీభత్సం.. ఇందువల్లేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తిరుపతి నగరం తడిసి ముద్దవుతోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ఆధ్యాత్మిక నగరం చిన్నపాటి వర్షాలకే అస్తవ్యస్థంగా మారుతోందని వాపోతున్నారు. స్మార్ట్‌ సిటీ పేరుకే తప్ప ఆచరణలో ఆ ఆనవాళ్లే కనబడటం లేదంటున్నారు. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలతో పాటు తమిళనాడులోని కోస్తా జిల్లాల్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలలో నెలకొన్న ఈ వరద బీభత్సానికి కారణాలివేనా?

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో..

దేశంలోకి మే చివరి రోజుల నుంచి జూన్‌ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. క్రమంగా విస్తరించుకుంటూ దేశమంతటా వర్షాలు కురిపిస్తాయి. అయితే తమిళనాడు తీరప్రాంతంలో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులోని తూర్పు ప్రాంతాలు, నెల్లూరు జిల్లా ప్రాంతాలపై ఈ రుతుపవనాల ప్రభావం ఉండదు. నైరుతి రుతుపవనాలు హిమాలయాలకు వెళ్లి వాటిని దాటలేక తిరిగి వెనక్కు వస్తాయి. అయితే వెళ్లిన దారిలో కాకుండా బంగాళాఖాతం మీదుగా పయనిస్తాయి. అందుకే వీటిని తిరోగమన రుతుపవనాలు అనికూడా అంటారు. నవంబరు మాసంలో ఇవి బంగాళాఖాతానికి చేరుకుంటాయి. ఈ ప్రభావంతో అప్పుడప్పుడు వాయుగుండాలు, అల్పపీడనాలు ఏర్పడుతాయి. దీంతో సాధారణంగా చిత్తూరు జిల్లాలో కురిసే వర్షాలు భారీగా మారుతాయి. ఫలితంగా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. అయితే ఏటా ఇలాంటి వర్షపాతం నమోదుకాదు.కానీ గత మూడు, నాలుగు సంవత్సరాలుగా అల్పపీడనాలు తోడు కావడంతో ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి.

* బంగాళాఖాతానికి సమీపంలో ఉండటంతో వర్షాల ప్రభావం ఈ ఆధ్యాత్మిక నగరంపై ఉంటుంది. తిరుపతి నుంచి తడ 100 కి.మీ.లోపు దూరం మాత్రమే.

* గుంటల ఆక్రమణ: రాయలవారి కాలంలో తిరుపతిలో అనేక గుంటలను తవ్వించారు. కానీ తుమ్మలగుంట, కేశవాయనగుంట, మల్లయ్య గుంట, తాతయ్యగుంట, తాళ్లపాక చెరువు, కొరమీనుగుంట తదితర ప్రాంతాలన్నీ ఆక్రమణకు గురయ్యాయి. 

* ఆర్టీసీ బస్టాండును తాళ్లపాక చెరువుపై, కూరగాయల మార్కెట్‌ను మల్లయ్య గుంటపై నిర్మించడంతో వర్షపునీరు రోడ్లపైకి వస్తోంది. అక్కడే ఉన్న పెద్ద జలవనరు తాతయ్యగుంట పూర్తిగా మాయమైంది.

* కపిలతీర్థం, మాల్వాడిగుండం నుంచి వచ్చే జలపాతం నీరంతా తిరుపతికి అడ్డంగా ప్రవహించి తిరుచానూరు దక్షిణ భాగంలోని స్వర్ణ ముఖి నదిలో కలుస్తుంటుంది. అయితే ఈ కాల్వలన్నీ కుచించుకుపోవడంతో కాలువల్లో ప్రవహించేనీరు రోడ్లపైకి చేరడంతో పాటు లోతట్టు ప్రాంతాల గృహాలన్ని నీటమునుగుతున్నాయి.

* తిరుపతి నగరం భౌగోళికంగా భిన్నమైంది. పడమర, తూర్పు ప్రాంతాలు ఎత్తుగా ఉంటాయి. ఉత్తర ప్రాంతం కొండలు. నీరు దక్షిణంగా ప్రవహించాలి. అయితే జలవనరుల విధ్వంసంతో వరదనీరు అక్కడే నిలిచిపోతోంది.

* తూర్పు ప్రాంతంలో ఓవర్‌ బ్రిడ్జిని నిర్మించారు. దీంతో నీరు పోవడంలేదు. పట్టణ ప్రణాళిక కూడా సరిగా లేకపోవడం మరో కారణం.

* కొండల పైనుంచి వచ్చే వరద నీటితో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు తిరుపతి ప్రజల్లో భయం..భయమే.

* తిరుపతికి ఎగువన దాదాపు 15 కి.మీల ప్రాంతంలో కురిసే వర్షపు నీరంతా అంతర్గత కాల్వల ద్వారా నగరం వెలుపలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణా వైఫల్యంతో సమస్య మరింత జఠిలంగా మారుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీరు ప్రవహించే కాలువల్లో సరిగా పూడిక తీయకపోవడం, రైల్వే అండర్‌ బ్రిడ్జిల ప్రాంతాల్లో నాలాలు పూడిపోవడంతో ప్రమాదంగా మారుతున్నాయని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధాన కాల్వలతో పాటు కాలువలు ఆక్రమణకు గురికావడంతో వర్షపు నీరు వీధుల్లోకి చేరి చెరువులను తలపిస్తోంది. 

* తిరుమలకు వెళ్లే ప్రధాన దారి కొర్లగుంట, పేరులోనే ఇది నీటివనరు అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అక్కడ ఎలాంటి చెరువులేదు. గరుడ వారధి నిర్మాణం జరుగుతుండటంతో నీరు పోలేక అక్కడ నిలుస్తోంది. నగరంలోని రైల్వే అండర్‌ బ్రిడ్జిలు నీట మునిగి నగరవాసులతో పాటు యాత్రికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులైతే ఇక్కడి రహదారుల పరిస్థితులపై అవగాహన లేక నానా అవస్థలకు గురవుతున్నారు. 

* తిరుమల గిరుల్లో కురిసిన వర్షపునీటితో మల్వాడి గుండం పరివాహక ప్రాంతాలైన ఎర్రమిట్ట, శివజ్యోతినగర్‌, యశోదానగర్‌, రైల్వేకాలనీ, మధురానగర్‌, దేవేంద్ర థియేటర్‌, కొత్తపల్లె, ఆటోనగర్‌ తదితర ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఆక్రమణల్లో ఉన్న వర్షపునీటి కాలువల్ని పునరుద్ధరిస్తే తప్ప తిరుపతి నగరం ముంపు నుంచి బయటపడే అవకాశం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.

Read latest General News and Telugu News


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని