
Mosquitoes: దోమలు కొందరినే ఎక్కువగా కుడతాయి.. ఎందుకు?
ఆడదోమలే ఎందుకు రక్తం తాగుతాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: వర్షకాలం వచ్చిందంటే దోమలు ఎక్కువవుతాయి. ఎక్కడికక్కడ నీళ్లు నిలువ ఉండటం, చెత్తా చెదారాలు పేరుకుపోవడంతో దోమల సంతతి పెరుగుతుంది. దోమలు కుట్టడం వల్ల ఫైలేరియా, మెదడువాపు వ్యాధి, చికున్‌గన్యా, మలేరియా, డెంగ్యూ, జికా తదితర వైరల్ జ్వరాలు ఇతరులకు వ్యాపిస్తాయి. దోమలు సాధారణంగా పొద్దున, సాయంత్ర సమయాల్లో ఎక్కువ చురుగ్గా ఉంటాయి. కానీ దోమలు కొందరినే ఎక్కువగా కుడుతుంటాయనే విషయాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ఓ అధ్యయనం ప్రకారం 20 శాతం మందే దోమల నుంచి వచ్చే వ్యాధులను 80 శాతం మేరకు వ్యాపింపజేస్తుంటారు. అవి అందరినీ ఒకేలా కుట్టక కొందరినే ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటాయో చూద్దాం..
ఆడదోమలే ఎందుకు కుడుతుంటాయ్?
ఆడదోమలు గుడ్లు పెట్టేందుకు కావాల్సిన పోషణకోసం రక్తం తాగుతాయి. ఒకసారి రక్తం తాగాక 30 నుంచి 300 గుడ్లను పెడతాయి. మళ్లీ గుడ్లు పెట్టాలంటే మళ్లీ రక్తం తాగుతాయి. మగదోమలు రక్తం మీద కాకుండా పూల మకరందాన్ని, చెట్లు, మొక్కల రసాలను పీల్చుకుని బతుకుతాయి.
కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తే వాలిపోతాయి
శ్వాసక్రియలో కార్బన్‌డయాక్సైడ్ విడుదల అవుతుంది. వ్యాయామాలు చేసేటప్పుడు ఎక్కువ సీఓ2ను విడుదల చేస్తాం. వెంటనే అధికంగా ఉండే కార్బన్‌డయాక్సైడ్ వాయువును పసిగట్టి దోమలు దగ్గరలోనే ఏదో మంచి విందు దొరకుతుందని రయ్‌మని వచ్చి వాలిపోతాయి. వాహనాల నుంచి వెలువడే సీఓ2 కంటే మనిషి నుంచి వెలువడే వాయువునే ఎక్కువగా ఇష్టపడతాయి.
శరీరం నుంచి వెలువడే పరిమళం!
మనిషి స్వేదం, చర్మంలోంచి వెలువడే కొన్ని వాసనలు దోమలను ఆకట్టుకుంటాయి. మనిషిలోని జీన్స్, చర్మంలో ఉండే బ్యాక్టీరియా వల్ల వాసనల్లో తేడాలు ఉంటాయి. లాక్టిక్ యాసిడ్, అమ్మోనియా ఎక్కువగా ఉండే వ్యక్తి చర్మం మీద కూర్చుని రక్తం తాగుతాయి.
రంగుల దుస్తులు వేసుకునేవారంటేనే మక్కువ
దోమలు నలుపు రంగుకు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. ముదురు రంగులు కూడా దోమలను బాగా ఆకట్టుకుంటాయి. లేత రంగు దుస్తులు వేసుకున్నవారి దగ్గరకు ఎక్కువగా రావు.
మద్యం కూడా ఆకర్షిస్తుంది
దోమలు తాగుబోతులు కావు. కానీ 2002లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం తాగని వారితో పోల్చితే బీరు తాగినవారినే దోమలు ఎక్కువగా కుడతాయి.
బ్లడ్ గ్రూప్ బట్టి కూడా..
‘జర్నల్ ఆఫ్ మెడికల్ ఎంటమాలజీ’ ప్రకారం ‘ఎ’ గ్రూప్ రక్తం కలవారికంటే ‘ఒ’ గ్రూపు రక్తం కలవారినే దోమలు రెండురెట్లు ఎక్కువగా కుడతాయి.
ఎక్కువగా దోమల బారిన పడే భాగాలు!
తల, కాళ్లను దోమలు ఎక్కువగా కుడతాయి. ఆ భాగాల్లో స్వేద గ్రంధులు ఎక్కువగా ఉండటం, వేడిగా ఉండటం వల్ల దోమలు ఆకర్షితమవుతాయి.
రియాక్షన్లు కూడా వస్తుంటాయి
దోమల్లో దాదాపు 3500 రకాలు ఉన్నాయి. అంతవరకూ ఎన్నడూ కుట్టించుకోని దోమల బారిన పడ్డప్పుడు శరీర రక్షణ వ్యవస్థ ప్రతిస్పందిస్తుంది. ఫలితంగా కొన్నిసార్లు ఒళ్లంతా దురద, వాపులు కూడా రావచ్చు. దోమలు చర్మంపై కూర్చుని మనల్ని కుట్టే ముందు ఒకరకమైన లాలాజలాన్ని విడుదల చేస్తాయి. ఆ లాలాజలానికి మన శరీరం రియాక్షన్ చూపిస్తుంది. సీరియస్ రియాక్షన్లు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
దోమల వల్ల ఉపయోగాలు
దోమల జీవితానికి ఓ అర్థం, పరమార్థం ఏమైనా ఉందా? అవి ఎందుకు జీవించాలి? అని కొందరు అనుకుంటుంటారు. అవి కప్పలు, బల్లులు, తూనీగలు, చేపలు వంటి జీవులకు ఆహారంగా ఉపయోగపడతాయి. అలాగే కొన్ని రకాల దోమలు పూల మీద వాలుతుండటంతో, పరపరాగ సంపర్కానికి దోహదం చేస్తాయి.
ఇవీ చదవండి
Advertisement