DTH Recharge: డీటీహెచ్‌ రీఛార్జి చేయలేదని విడాకులు కోరిన భార్య!

డీటీహెచ్‌ రీఛార్జి చేయలేదన్న కారణంతో భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. అంతేకాదు.. రీఛార్జి చేయలేని భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరింది.

Published : 03 Jul 2022 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నగలు కొనలేదనో.. బయటకు తీసుకెళ్లలేదనో అలిగే భార్యలను చూసుంటారు. తాగొచ్చి హింసిస్తున్నాడనో.. కొట్టాడనో కారణంతో ఇల్లు వదిలి పుట్టింటికి వెళ్లేవారి గురించి వినే ఉంటారు. కానీ, ఇక్కడో ఇల్లాలు డీటీహెచ్‌ రీఛార్జి చేయలేదన్న కారణంతో భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. అంతేకాదు.. రీఛార్జి చేయలేని భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో జరిగింది.

ఇటీవల వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. టీవీ లేకుండా ఒక్క క్షణం లేకుండా ఉండలేని ఆ భార్య డీటీహెచ్‌ రీఛార్జి అయిపోవడంతో భర్తను రీఛార్జి చేయమని కోరింది. అయితే, ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని సమాధానం చెప్పాడు భర్త. ఇదే అతగాడు చేసిన తప్పు. వెంటనే ఇల్లొదిలి ఆ ఇల్లాలు పుట్టింటికి వెళ్లిపోయింది. వెళ్లే ముందు ‘టీవీ లేకుంటే పెళ్లామూ ఉండదు’ అంటూ రైమింగ్‌లో ఓ డైలాగ్‌ చెప్పి మరీ వెళ్లిపోయింది. అప్పటికీ అతగాడు సాయంత్రం పనికెళ్లి వచ్చి రీఛార్జి చేయిస్తానని మాటిచ్చినా ఆమె వినలేదు. తీరా పుట్టింటికి వెళ్లాక తనకు విడాకులు కావాలని పట్టుపట్టింది.

ఈ వ్యవహారం పోలీసులకు చేరడంతో వారు సైతం కంగుతిన్నారు. ‘ఇదేం కేసురా బాబూ’ అనుకుంటూనే విధి నిర్వహణలో భాగంగానే భార్యభర్తలను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇప్పించారు. జీవితంలో ఇలాంటివి సహజం అంటూ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కొన్ని రోజుల కౌన్సెలింగ్‌ తర్వాత భార్యాభర్తలు మళ్లీ ఒక్కటయ్యారు. ఇంత జరిగాక రీఛార్జి చేశాడో లేదో ఇంతకీ ఈ బాసు!?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు