Madhya Pradesh: చెట్టుపై నుంచి కురిసిన నోట్ల వర్షం.. ఏం జరిగిందంటే?

చెట్టుపై నుంచి నోట్ల వర్షం కురవడం ఏమిటి అనుకుంటున్నారా.. మీరు చదివింది నిజమే.. అయితే ఇందుకు కారణం ఓ వానరం.....

Published : 04 Oct 2021 01:09 IST

భోపాల్‌: చెట్టుపై నుంచి నోట్ల వర్షం కురవడం ఏమిటి అనుకుంటున్నారా.. మీరు చదివింది నిజమే.. అయితే ఇందుకు కారణం ఓ వానరం. ఆటోరిక్షా నుంచి డబ్బులు ఎత్తుకెళ్లిన  ఓ కోతి చెట్టుపైకి ఎక్కి అక్కడి నుంచి వాటిని వెదజల్లింది. దీంతో ఆ డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి లబోదిబోమంటున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కటావ్‌ఘట్‌ ప్రాంతానికి చెందిన మొహమ్మద్‌ అలీ అనే వ్యక్తి లక్ష రూపాయలను  టవల్‌లో చుట్టుకొని ఆటో రిక్షాలలో ప్రయాణిస్తున్నాడు. అతడి వెంట మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు.

అయితే ఇరుకు రోడ్లతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ట్రాఫిజ్‌ జామ్‌ ఏర్పడింది. అసలేం జరిగిందో చూద్దామని ఆ ముగ్గురు ఆటోరిక్షా కిందకు దిగడంతో.. ఎక్కడి నుంచో అకస్మాత్తుగా వచ్చిన ఓ కోతి ఆటోలో ఉన్న డబ్బుల మూటను ఎత్తుకుపోయింది. అక్కడే ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కింది. తినుబండారాలుగా భావించి ఆ మూటను ఎత్తుకుపోయినట్లు తెలుస్తోంది. చెట్టు పైకి ఎక్కిన తర్వాత ఆ టవల్‌ను దులిపింది. దీంతో అందులోని డబ్బులు మొత్తం కిందపడిపోయాయి. డబ్బులు చెల్లాచెదురుగా పడిపోవడంతో అక్కడే ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుపోయిన కొంతమంది తమ చేతివాటం చూపించారు. దీంతో రూ.లక్షకు గానూ కేవలం రూ.56వేలను మాత్రమే బాధితుడు  సేకరించుకోగలిగాడు. దాదాపు రూ.44వేలు నష్టపోవడంతో అతడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని