Andhra News: ఏపీ ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో రూ.800 కోట్లు మాయం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి డబ్బులు డెబిట్‌ అయ్యాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత

Updated : 17 Aug 2022 16:22 IST

పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తాం: ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి డబ్బులు డెబిట్‌ అయ్యాయని ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల ఖాతాల నుంచి నగదు విత్‌ డ్రా చేసుకున్నట్టు గత రాత్రి సందేశాలు వచ్చాయన్నారు. తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ.83వేలు విత్‌డ్రా చేశారని పేర్కొన్నారు. డబ్బులు ఎవరు తీసుకున్నారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ డీఏ ఎరియర్స్‌ జీపీఎఫ్‌ ఖాతాలకు జమ చేస్తామన్నారని, గడిచిన 6 నెలలుగా ఇచ్చిన డీఏ ఎరియర్స్‌ను మళ్లీ వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. 

 గతంలోనూ ఇదే తరహాలో జరిగితే ఫిర్యాదు చేస్తే మళ్లీ తిరిగి వేశారని గుర్తు చేశారు. తాజాగా మొత్తం 90వేల మంది ఉద్యోగులకు చెందిన జీపీఎఫ్‌ ఖాతాల నుంచి రూ.800 కోట్ల వరకు వెనక్కి తీసుకున్నారని తెలిపారు. ఆర్థికశాఖకు ఫిర్యాదు చేసేందుకు వెళితే.. అధికారులు అందుబాటులో లేరని చెప్పారు. ఈ తరహా ఘటనలు ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నాయా? లేక ఉన్నతాధికారుల తప్పిదమో తెలియడం లేదన్నారు. ఉద్యోగుల సమ్మతి లేకుండా వారి ఖాతాల నుంచి సొమ్ము విత్‌డ్రా చేయడం నేరమని సూర్యనారాయణ పేర్కొన్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తామని తెలిపారు. మార్చి నెలలో జరిగిన లావాదేవీలను అకౌంటెంట్‌ జనరల్‌ తమకు ఇప్పటి వరకు తెలియజేయకపోవడం కూడా తప్పిదమేనన్నారు. ఆర్థిక శాఖలోని సీఎఫ్ఎంఎస్‌లో ఉన్న సీపీయూ యూనిట్ వద్ద తమ వేతన ఖాతాల నుంచి విత్ డ్రా చేసే సాంకేతికత ఉందని, ఇది ఎంత వరకు చట్టబద్దమని ప్రశ్నించారు. దీనిపై లోతైన విచారణ జరగాలని ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని