Fight: సోదరిని కాపాడేందుకు మొసలితో పోరాటం

కవల సోదరిని కాపాడుకునేందుకు ఓ యువతి అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించింది. ఏకంగా మొసలితో పోరాడి సోదరి ప్రాణాలు రక్షించింది....

Published : 09 Jun 2021 16:51 IST

మెక్సికో సిటీ: తన సోదరిని కాపాడుకునేందుకు ఓ యువతి ఏకంగా మొసలితో పోరాడింది. బ్రిటన్‌కు చెందిన కవల సోదరీమణులు మెలిస్సా, జార్జియా ల్యూరీ ప్రస్తుతం మెక్సికోలో ఉంటున్నారు. ఆన్‌లైన్‌లో ఓ గైడ్‌ను బుక్‌ చేసుకొని ఓ కొలనులో ఈతకు వెళ్లారు. అయితే వారు ఈత కొడుతున్న కొలనులో దాగివున్న ఓ మొసలి మెలిస్సాపై దాడి చేసింది. ఆమెను నీటి లోతుకు లాక్కెళ్లింది. ఈ క్రమంలో తన సోదరి ప్రాణాలు రక్షించేందుకు ల్యూరీ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ మొసలితో పోరాడింది. మొసలి తలపై కాలితో తన్నుతూ మెలిస్సాను పైకి లాక్కొచ్చే ప్రయత్నం చేసింది. కానీ మొసలి వారిని వదల్లేదు. మెలిస్సాను పైకి లాక్కొచ్చే కొద్దీ మళ్లీ దాడి చేస్తూ లోపలికి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన మెలిస్సా స్పృహ కోల్పోయింది. ల్యూరీకి కూడా గాయాలయ్యాయి. అయినా పట్టువదలని ల్యూరీ మొసలితో పోరాడి ఎట్టకేలకు తన సోదరిని బయటకు తీసుకొచ్చింది.

మెలిస్సాను ఆసుపత్రికి తరలించగా కోమాలోకి వెళ్లిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. చికిత్సకు భారీగా ఖర్చు కానుండటంతో వారు ఆన్‌లైన్‌లో నిధులు సమకూర్చే ఓ ఎన్జీవోను ఆశ్రయించారు. కొన్ని నిధులు సమకూరడంతో ప్రస్తుతం మెలిస్సాకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బ్రిటిష్‌ ఎంబసీ సైతం ఈ ఘటనపై స్పందించింది. బాధితురాలికి అండగా ఉంటామని ప్రకటించింది. అయితే కవలలు బుక్‌ చేసుకున్న గైడ్‌కు లైసెన్స్‌ లేదని, మెలిస్సాపై దాడి అనంతరం గైడ్‌ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని