
Mask: మాస్కు ధరించలేదని మహిళపై ఖాకీల దాడి
రోడ్డుపైనే ఈడ్చుకుంటూ కొట్టిన మధ్యప్రదేశ్ పోలీసులు
భోపాల్: కొవిడ్ నిబంధనల పేరుతో మధ్యప్రదేశ్ పోలీసులు రెచ్చిపోయారు. మాస్కు ధరించలేదనే కారణంతో ఓ మహిళపై ఆమె కుమార్తె ముందే పోలీసులు అమానుషంగా దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మహిళను పోలీసులు నడిరోడ్డుపైనే ఈడ్చుకుంటూ కొడుతూ, కాలితో తంతున్న దృశ్యాలను మొబైల్ ఫోన్‌లో ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఓ మహిళ, ఆమె కుమార్తె నిత్యావసర సరకులు కొనేందుకు బయటకు వచ్చారు. కొవిడ్ నిబంధనల పేరుతో మాస్కు ధరించలేదంటూ ఆ మహిళను ఇద్దరు పోలీసులు కొట్టారు. వారి నుంచి విడిపించుకొనేందుకు ఆమె ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో ఆమె పలుమార్లు రోడ్డుపై కింద పడిపోయింది. ఆమెను పోలీసు వాహనంలోకి ఎక్కించేందుకు ఓ మహిళా పోలీసు సైతం ప్రయత్నించగా.. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. తల్లిని వారి నుంచి విడిపించేందుకు కుమార్తె చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆర్తనాదాలు చేస్తున్న ఆ మహిళ జుట్టు పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీసులు హింసకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలన్నీ వీడియోలో రికార్డయ్యాయి. కొవిడ్ నిబంధనల పేరుతో ఇలాంటి అమానుషాలకు పాల్పడటం మధ్యప్రదేశ్ పోలీసులకు కొత్తేమీ కాదు. మాస్కు ధరించలేదనే కారణంతో ఇండోర్‌లో ఓ వ్యక్తిపై పోలీసులు గత నెల ఇదే విధంగా హింసకు దిగారు. కరోనా నిబంధనల ఉల్లంఘన పేరుతో దేశవ్యాప్తంగా గత నెల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో పోలీసులపై చాలా ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది.