సిక్‌ లీవ్‌ పెట్టి ఆట చూసింది.. ఉద్యోగం పోయింది!

నిజంగా అత్యవసరం ఉన్నప్పుడు, అనారోగ్యానికి గురైనప్పుడు విధులకు సెలవు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ, అబద్ధం చెప్పి సెలవు తీసుకోవడం వల్ల ఓ మహిళ తన ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. తనకిష్టమైన ఫుట్‌బాల్‌ గేమ్‌ చూడటం కోసం

Updated : 16 Jul 2021 08:15 IST


(Photo: futadictos_mx insta)

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిజంగా అవసరం ఉన్నప్పుడు, అనారోగ్యానికి గురైనప్పుడు విధులకు సెలవు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ, అబద్ధం చెప్పి సెలవు తీసుకోవడం వల్ల ఓ మహిళ కష్టాల్లో పడింది. తనకిష్టమైన ఫుట్‌బాల్‌ గేమ్‌ చూడటం కోసం విధులకు కొట్టిన డుమ్మా.. ఆమె జీవితానికి పెద్ద దెబ్బ కొట్టింది. ఇంతకీ ఏమైందంటే..

యూకేలోని బ్రాడ్‌ఫోర్డ్‌కు చెందిన నైనా ఫారుకీ ఓ కంపెనీలో డిజిటల్‌ కంటెంట్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఫుట్‌బాల్‌ క్రీడంటే చాలా ఇష్టమట. ఇటీవల యూరో ఛాంపియన్‌షిప్‌ టోర్నీ జరిగిన విషయం తెలిసిందే కదా..! ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఇటలీ గెలుపొంది విజేతగా నిలిచింది. అయితే ఫైనల్‌కు ముందు జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌, డెన్మార్క్‌ పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌ చూడటం కోసం నైనా తన విధులకు సెలవు పెట్టాలనుకుంది. కానీ, మ్యాచ్‌ చూడటానికి వెళ్తానంటే సెలవు ఇవ్వరని.. అనారోగ్యానికి గురయ్యానంటూ సిక్‌ లీవ్‌ తీసుకుంది. అదే రోజు తన స్నేహితురాలితో కలిసి స్టేడియంకు వెళ్లి మ్యాచ్‌ను వీక్షించింది. 

వీడియో క్లిప్‌.. ఉద్యోగం హుష్‌..

స్టేడియంలో ఇంగ్లాండ్‌ గోల్‌ చేయగానే సంతోషంతో నైనా తన స్నేహితురాలితో కలిసి ఎగిరి గంతులేస్తూ సంబరాలు చేసుకుంటూ అందరినీ ఆకట్టుకుంది. దీంతో స్టేడియంలో కెమెరామెన్‌ ఆమెవైపు కెమెరా తిప్పడంతో టీవీల్లో ఫుట్‌బాల్‌ లైవ్‌ మ్యాచ్‌ చూస్తున్న వారందరికి ఆమె కనిపించింది. ఆ వీడియో క్లిప్‌ను ఓ టీవీ వ్యాఖ్యాత తన ఇన్‌స్టాగ్రాంలో స్టోరీగా పెట్టుకోగా.. నైనా కూడా అదే వీడియోను తన ఇన్‌స్టా స్టోరీగా పెట్టుకుంది. 

టీవీలో నైనా కనిపించడం, ఇన్‌స్టాలో స్టోరీ పెట్టుకోవడంతో అనారోగ్యం అని అబద్ధం చెప్పి స్టేడియంలో మ్యాచ్‌ చూడటానికి వెళ్లిన విషయం తను పనిచేస్తోన్న కంపెనీ యాజమాన్యానికి తెలిసిపోయింది. దీంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. తప్పు ఒప్పుకొని క్షమించమని కోరినా.. యాజమాన్యం ఆమె అభ్యర్థనను నిరాకరించింది. దీంతో చిన్న అబద్ధం చెప్పినందుకు నైనా ఉద్యోగం పోగొట్టుకొని బాధపడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని