Ap news: అత్యాచార బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం

తాడేపల్లి అత్యాచార ఘటన చాలా దురదృష్టకరమని, ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని ఏపీ మహిళ, శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం అందిస్తామన్నారు....

Updated : 21 Jun 2021 16:09 IST

అమరావతి: తాడేపల్లి అత్యాచార ఘటన చాలా దురదృష్టకరమని, ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని ఏపీ మహిళ, శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం అందిస్తామన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి మరో రూ.50వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ‘‘ ఇద్దరు దుండగులు ఈ  నేరానికి  పాల్పడినట్లు ప్రాథమికంగా తెలిసింది. బాధితురాలితోపాటు ఆమె కాబోయే భర్తను కొట్టి బంగారు ఆభరణాలు లాక్కెళ్లిపోయారు. ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా 50 శాతం ఆధారాలు సేకరించాం. పోలీసు దర్యాప్తు కూడా త్వరితగతిన సాగుతోంది’’ వనిత అన్నారు.

తాడేపల్లి ఘటన హేయమైన చర్య అని హోం మంత్రి సుచరిత అన్నారు. కఠిన చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ ఇలాంటివి జరగడం దురదృష్టకరమన్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని, వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని ఆమె  తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 15 లక్షల మంది ఇప్పటివరకు దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నట్లు సుచరిత వివరించారు ‘‘ బ్లేడ్లతో బెదిరించి వారి వద్ద నుంచి ఫోన్లు లాక్కున్నారు. నిందితులు ఎవరైనా విడిచిపెట్టం. ఇలాంటి ఘటనలపై త్వరిగత గతిన దర్యాప్తు జరిగేలా రాష్ట్రంలో మూడు చోట్ల ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం .ఇప్పటికే ఈ ల్యాబుల్లో సిబ్బందిని నియామిస్తున్నాం.తాడేపల్లి ఘటన జరిగిన ప్రాంతంలో ఇటీవల 5 నేరాలు జరిగాయి. అలాంటివి జరగకుండా నిఘా, భద్రత ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం’’ అని సుచరిత అన్నారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో.. సీతానగరంలోని కృష్ణా నది పుష్కరఘాట్‌లో కాబోయే భర్త కాళ్లు చేతులను కట్టేసి.. కదిలితే పీక కోసేస్తామంటూ బెదిరించి అతడి కళ్లెదుటే ఓ యువతిపై ఇద్దరు దుండగులు అత్యంత క్రూరంగా అత్యాచారం జరిపిన సంగతి తెలిసిందే. బాధితురాలి ముఖాన్ని ఇసుకలో కుక్కేసి, ఊపిరాడనివ్వకుండా చేసి పాశవికంగా అకృత్యానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. సీఎం అధికారిక నివాసానికి కేవలం కిలోమీటరున్నద దూరంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని