Vijayawada: డిసెంబర్‌ 23, 24 తేదీల్లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్‌ 23, 24 తేదీల్లో

Updated : 23 Sep 2022 17:27 IST

అమరావతి: ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్‌ 23, 24 తేదీల్లో ఈ మహాసభలు విజయవాడలో నిర్వహించనున్నారు. మారుతున్న పరిస్థితుల్లో రచయితల పాత్ర- కర్తవ్యం, కార్యాచరణే లక్ష్యాలుగా ప్రపంచ 5వ తెలుగు రచయితల మహాసభలను విజయవాడలోని పి.బి.సిద్ధార్థ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి తెలుగు రచయితలు, సాహితీ అభిమానులు తరలిరావాలని మహాసభల గౌరవాధ్యక్షుడు, మాజీ సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ కోరారు.

కృష్ణా జిల్లా రచయితల సంఘం సహకారంతో ప్రపంచ తెలుగు రచయితల సంఘం నిర్వహణలో ఈ మహాసభలు జరగనున్నాయి. తెలుగు భాష, సంస్కృతి, చరిత్ర, సామాజిక రంగాలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. కర్తవ్యం- కార్యాచరణే లక్ష్యంగా సాగే ఈ సభల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి తమ ప్రతిభాపాటవాలతో రాణిస్తున్న సాహితీ మూర్తులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.  ప్రపంచ స్థాయిలో తెలుగు రచయితలు ఒకచోట సమావేశమై చేసే నిర్ణయాల ప్రభావం తప్పకుండా ప్రజల్ని చేరతాయని నిర్వాహకులు తెలిపారు. 

రెండు రోజుల పాటు జరిగే ఈ సభలకు రచయితలు, సాహిత్యాభిమానులు 2022 అక్టోబర్‌ 31లోగా రూ.500ల చొప్పున ప్రతినిధి రుసుం కింద చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. తమ చెల్లింపులను 9391238390 నంబర్‌కు ఫోన్‌ ద్వారా పంపవచ్చని సూచించారు. ప్రతినిధులకు భోజన వసతి కల్పిస్తామని తెలిపారు. మహాసభల్లో ప్రతినిధులకు మాత్రమే సదస్సులు, కవిసమ్మేళనాల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. అలాగే, సమయానుకూలతను బట్టి సభావేదికలపై ప్రతినిధులు తమ రచనలు ఆవిష్కరించుకొనేలా వెసులుబాటు కల్పిస్తామని పేర్కొన్నారు. గతంలో 2007, 2011, 2015, 2019 సంవత్సరాల్లో రచయితల ప్రపంచ మహాసభలు ఎంతో స్ఫూర్తిదాయకంగా జరిగాయి. భాషా సాంస్కృతిక, సామాజిక విలువలు పతనం అంచున నడుస్తోన్న ఈ సమయంలో రచయితలను సమాయత్తం చేయడానికి ఈ సభలు ఉపకరించనున్నాయని మహాసభల గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌, అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డా. జీవీ పూర్ణచందు ఒక ప్రకటనలో తెలిపారు. రచయితలు, సాహిత్యాభిమానులు తరలిరావాలని.. మరిన్ని వివరాలకు  9391238390 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని