longest non stop flight: 19 గంటల నాన్‌స్టాప్‌ జర్నీ.. ఈ విమానంలో ఫీచర్లేంటో తెలుసా?

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం నడిచే నాన్‌స్టాప్ కమర్షియల్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు క్వాంటాస్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది........

Published : 05 May 2022 01:31 IST

సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్‌ ఎయిర్‌లైన్స్‌ సరికొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం నడిచే నాన్‌స్టాప్ కమర్షియల్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు తాజాగా ప్రకటించింది. 2025 చివరి నాటికి వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది. సిడ్నీ నుంచి లండన్‌కు వీటిని నడుపనున్నామని, ఈ ప్రయాణం ఏకధాటిగా 19.19 గంటలపాటు ఉంటుందని పేర్కొంది. ప్రయాణం ఎక్కువ దూరం ఉండటం వల్ల ఈ విమానాల్లో ప్రత్యేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు క్వాంటాస్‌ ఎయిర్‌లైన్స్‌ తెలిపింది.

ఈ విమాన సర్వీసుల కోసం ఐదేళ్ల నుంచి ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. ‘ప్రాజెక్ట్‌ సన్‌రైజ్‌’ పేరుతో 12 ఎయిర్‌బస్ A350-1000 విమానాలను ఆర్డర్ చేసినట్లు ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది. 2025 చివరినాటికి సిడ్నీ నుంచి లండన్‌తోపాటు న్యూయార్క్‌కు సర్వీసులు ప్రారంభిస్తామని, ఆ తర్వాత మెల్‌బోర్న్‌ నుంచి కూడా నడపనున్నట్లు తెలిపింది. ఈ ప్రయాణాన్ని ఒకే విమానంలో చేపట్టేందుకు ఏళ్ల నుంచి ప్రణాళికలు రూపొందిస్తున్నామని క్వాంటాస్‌ అధ్యక్షుడు అలన్‌ జోయిస్‌ పేర్కొన్నారు.

సిడ్నీ-లండన్‌ మధ్య 17,800 కి.మీ. (11,030 మైళ్లు) మార్గంలో ఒకే విమానంలో ప్రయాణం సాగించేలా క్వాంటాస్‌ 2019 నుంచే పరీక్షలు చేపట్టింది. కాగా ఇందుకే 19 గంటల 19 నిమిషాల సమయం పట్టింది. న్యూయార్క్-సిడ్నీ మధ్య 16,200 కిలోమీటర్ల (10,200 మైళ్ళు) దూరాన్ని కవర్ చేసేందుకు టెస్ట్ ఫ్లైట్‌ 19 గంటల సమయాన్ని తీసుకుంది. క్వాంటాస్ ఇప్పటికే 14,498 కి.మీ. పెర్త్-లండన్ ప్రయాణాన్ని నిర్వహిస్తోంది. ఇందుకు 17 గంటల సమయం పడుతోంది.

సుదూర ప్రయాణం నేపథ్యంలో A350 విమానాల్లో ప్రత్యేక క్యాబిన్‌ను తయారు చేయనున్నారు. మొత్తం 238 మంది ప్రయాణికులకు సరిపడా ఈ విమానాల్లో సీటింగ్ కెపాసిటీ ఉండనుంది. ఫస్ట్ క్లాస్ సూట్‌లో ప్రత్యేక బెడ్, వాలు కుర్చీ, వార్డ్‌రోబ్‌ను ఏర్పాటు చేయనుండటం విశేషం. 40 A321 XLR సహా A220 విమానాలను కూడా ఆర్డర్ చేస్తున్నట్లు క్వాంటాస్‌ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని