yellow watermelon: ఐడియా.. అదిరింది గురూ!

రిలయన్స్‌,బిగ్‌బజార్‌మార్కెట్లకు తన దిగుబడిని నేరుగా విక్రయిస్తూ మంచి రాబడి సాధిస్తున్న ఆ యువరైతు పేరు బస్వరాజ్‌ పాటిల్‌.

Published : 12 Jun 2021 18:42 IST

పుచ్చకాయ కోస్తే ఏ రంగులో ఉంటుంది.. మరో ఆలోచన లేకుండా ఎరుపు రంగు అని చెప్పేస్తారు. పసుపు పచ్చరంగు పుచ్చకాయని ఎప్పుడైనా చూశారా అని అడిగితే మాత్రం.. సామాజిక మాధ్యమాల్లో.. లేదా విదేశాల్లో చూశామన్న సమాధానమే వినిపిస్తుంది. అదే కర్ణాటకు చెందిన ఓ యువకుడిని ఆలోచనలో పడేసింది. మన దేశంలోనూ ఈ రకం పుచ్చకాయలు పండించవచ్చని నిరూపించేలా చేసింది. అంతేకాదు అమ్మకాల్లో ప్రత్యేకత చాటుతూ.. రైతులకే ఓ సూపర్‌ మోడల్‌గా నిలిచేలా ప్రోత్సహించింది. ఆ యువ రైతు ఎవరో.. పసుపు రంగు పుచ్చకాయల కథేంటో చూద్దమా!

కర్ణాటకలోని కోరల్లికి చెందిన ఓ యువరైతు పేరు ఈ వేసవిలో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అందుకు కారణం.. అతని పొలంలో శాస్త్రీయంగా పసుపుపచ్చ పుచ్చకాయలు పండించడమే. స్థానిక పండ్ల మార్కెట్లు సహా.. రిలయన్స్‌, బిగ్‌బజార్‌ వంటి దిగ్గజ రిటైల్‌ మార్కెట్లకు నేరుగా విక్రయిస్తూ మంచి రాబడి సాధిస్తున్న ఆ యువరైతు పేరు బస్వరాజ్‌ పాటిల్‌.

ఇంజినీరింగ్ చేసిన బసవరాజ్‌.. ఉద్యోగాలు, వ్యాపారాలపైపు కన్నెత్తి కూడా చూడలేదు. తండ్రికి ఉన్న 70ఎకరాల పొలంలో వ్యవసాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇంత కష్టపడి చదివించినా.. మళ్లీ వ్యవసాయం చేయడం ఏంటని బస్వరాజ్‌ తల్లిదండ్రులు అడ్డుచెప్పారు. అయినా వారి మాట పట్టించుకోకుండా.. పొలంలో మిశ్రమ పంటను పండించడం మొదలుపెట్టాడు. సేంద్రీయ తోటలో పండ్ల తోటను పండించడం పై ప్రత్యేక దృష్టి పెట్టాడు.

అందరి రైతుల్లా నష్టాలబారిన పడకుండా ఉండాలంటే.. అందరికన్నా భిన్నమైన పంటను పండించాలనుకున్నాడు బస్వరాజ్‌. ఆ క్రమంలో పరిశోధన చేయగా.. పోషకవిలువలు, విటమిన్లు మెండుగా ఉండే... పసుపు రంగు పుచ్చకాయ గురించి తెలుసుకున్నాడు. కర్ణాటకలో మరే రైతు.. వీటిని పండించలేదన్న విషయం గుర్తించి విత్తనాలు తెప్పించుకున్నాడు.

ప్రయోగాత్మకంగా గతేడాది రెండెకరాల్లో రెండు లక్షల రూపాయల పెట్టుబడితో పసుపు పుచ్చకాయల పంటవేశాడు బస్వరాజ్‌. కరోనా ప్రభావం పెద్దగా లేని సమయంలో మార్కెటింగ్‌కి ఎలాంటి ఇబ్బంది రాకపోవడంతో నాలుగు లక్షల ఆదాయం వచ్చింది. ఆ ఉత్సాహంతోనే ఈ ఏడాది నాలుగు లక్షల పెట్టుబడితో నాలుగెకరాల్లో అదే పంట వేశాడు. పంట చేతికొచ్చే సమయానికి కరోనా రెండో దశ ఉద్ధృతి పెరగడంతో నష్టం తప్పదా అన్న ఆలోచనలో పడ్డాడు.

లాక్‌డౌన్‌ కారణంగా నష్టం తప్పదన్న బాధను స్నేహితులతో పంచుకున్నాడు బస్వరాజ్‌. సామాజిక మాధ్యమాలను వినియోగించుకొని, మార్కెటింగ్‌ చేసుకోవాలన్న ఆలోచన తట్టింది. అలా ఓ వాహనం అద్దెకు తీసుకొని ఈ రకం పుచ్చకాయ వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ బ్యానర్లు తయారు చేయించారు. కాయలపై నాణ్యత తెలిపే స్టికరింగ్‌ వేయించారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఎంతో మంది వినియోగదారులను ఆకట్టుకున్నారు.

ఏ రోజు, ఏ చోట, ఏ సమయానికి పుచ్చకాయలు విక్రయానికి పెడతామో ముందే సోషల్‌ మీడియాలో అప్‌డేట్‌ పెట్టేవాడు బస్వరాజ్‌. అలా చెప్పిన సమయానికి చెప్పినచోటుకి లోడుతో వాలిపోయేవాడు. ఈ పద్ధతి జనాలకు చేరేందుకు పెద్దగా సమయం పట్టలేదు. పుచ్చకాయలు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. అలా 80 నుంచి 90వేల కాయలను అలవోకగా అమ్మేశాడీ టెక్ రైతు.

పసుపు రంగు పచ్చకాయల గురించి విన్నా, అవి ఎక్కడ దొరుకుతాయో తెలియక, ఊరుకునే వాళ్లమని చెబుతున్నారు వినియోగదారులు.  వాట్సాప్‌, ఫేస్‌బుక్ గ్రూపుల ద్వారా విక్రయాల సమాచారం తెలుసుకొని వచ్చి తీసుకెళ్తున్నామని చెప్పుకొచ్చారు.

శాస్ర్తీయంగా సిట్రులస్‌, లానస్‌గా పిలిచే.. పుచ్చకాయల జన్మస్థలం ఆఫ్రికా.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికి పైగా వెరైటీల్లో ఈ పంట పండుతుంది. విటమిన్‌ ఏ,సీ, సహా రోగనిరోధక శక్తి. చర్మ ఆరోగ్యం పెంచే పోషకాలు, క్యాన్సర్‌, కంటి రోగాలతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని