టూత్‌బ్రష్‌లపై బాక్టీరియా..!

నిత్యం వినియోగించే టూత్‌బ్రష్‌లపై బాక్టీరియా ఎక్కువగా ఎక్కడ నుంచి వస్తుందనే విషయాన్ని తెలుసుకునేందుకు నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా అధ్యయనం చేపట్టారు.

Published : 03 Feb 2021 20:44 IST

శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిత్యం వాడే టూత్‌బ్రష్‌పై భారీ స్థాయిలో సూక్ష్మజీవులు ఉంటాయన్న విషయం తెలిసిందే. వీటిని వాడిన తర్వాత బాత్‌రూంలో పెట్టడం వల్ల అక్కడి టాయిలెట్‌, గోడల దుమ్ము వల్ల వాటిపై బాక్టీరియా చేరుతుందనే ఆందోళన ఉంది. అయితే, టాయిలెట్‌ కంటే ఎక్కువగా మన నోటిలోని బాక్టీరియానే టూత్‌బ్రష్‌లపై ఎక్కువగా పేరుకుపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. నిత్యం వినియోగించే టూత్‌బ్రష్‌లపై బాక్టీరియా ఎక్కువగా ఎక్కడ నుంచి వస్తుందనే విషయాన్ని తెలుసుకునేందుకు అమెరికాలోని నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా, టూత్‌బ్రష్‌లను ఉంచే ప్రదేశం కంటే నోటి శుభ్రత, టూత్‌బ్రష్‌ వాడకమే కీలకమని సూచిస్తున్నారు.

సాధారణంగా రోజూ వాడే టూత్‌బ్రష్‌లను బాత్‌రూంలోనో, గోడలకు లేదా గదిలో ఏదో ఒకచోట పెడుతుంటాం. అలా వాడి పెట్టిన టూత్‌బ్రష్‌ల ముళ్లపై దుమ్మూ లేదా ఇతర సూక్ష్మజీవులు పేరుకుపోతూనే ఉంటాయి. అయితే, ఇలాంటివి ముఖ్యంగా టాయిలెట్‌ని ఫ్లష్‌ చేయడం వల్ల భారీస్థాయిలో వచ్చిపడతాయనే ఆందోళన ఉంది. ఇది నిజం కాదని, టాయిలెట్‌ కంటే మన నోటిలోని సూక్ష్మజీవులే టూత్‌బ్రష్‌లపై ఎక్కువగా ఉంటాయని తాజా పరిశోధల్లో వెల్లడైంది. టాయిలెట్‌ను ఫ్లష్‌ చేసిన సమయంలో సూక్ష్మజీవులు టూత్‌బ్రష్‌పై వచ్చిపడవని కచ్చితంగా చెప్పడంలేదని, కానీ, వాటితో పోలిస్తే మన నోటిలో ఉండే సూక్ష్మజీవులే ఎక్కువని నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ నిపుణులు అభిప్రాయపడ్డారు. టూత్‌బ్రష్‌లు ఏ ప్రదేశంలో పెట్టామనేది ముఖ్యం కాదనే విషయాన్ని తాజా నివేదిక వెల్లడిస్తోందని పరిశోధనకు నేతృత్వం వహించిన హెరికా హార్ట్‌మాన్‌ గుర్తుచేశారు. కేవలం మనం వాడే టూత్‌బ్రష్‌, మన నోటి శుభ్రతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

నమూనాల సేకరణ..
అధ్యయనానికి అవసరమైన టూత్‌బ్రష్‌ల కోసం పరిశోధకులు ప్రత్యేకంగా ట్రూత్‌బ్రష్‌ మైక్రోబయోమ్‌ ప్రాజెక్టును చేపట్టారు. తద్వారా వాడిన టూత్‌బ్రష్‌లతోపాటు నోటి శుభ్రతకు సంబంధించి మరికొంత సమాచారాన్ని పంపిచాలని ప్రజలను కోరారు. ఇలా సేకరించిన టూత్‌బ్రష్‌లపై ఉండే సూక్ష్మజీవుల వివరాలు తెలుసుకునేందుకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించారు. ఈ సమాచారాన్ని అక్కడి జాతీయ ఆరోగ్య కేంద్ర వద్ద ఉన్న వివిధ ప్రాంతాల మానవ శరీర సూక్ష్మజీవుల సమాచారంతో పోల్చి చూశారు. నోటిలో ఉండే సూక్ష్మజీవులు, చర్మంపై సాధారణంగా కనిపించే సూక్ష్మజీవులతో సరిపోలాయని, అతి తక్కువ మోతాదులో మాత్రమే మానవ ఆంత్రమూలానికి చెందినవని కనుగొన్నారు. తద్వారా టాయిలెట్‌ కంటే మన నోటిలో ఉండే బాక్టీరియానే మన టూత్‌బ్రష్‌లపై ఉంటుందనే విషయాన్ని నిర్ధారించారు.

సాధారణ పేస్టుతోనే నోటి శుభ్రత..
పరిశోధనలో భాగంగా టూత్‌బ్రష్‌లపై ఎన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయనే విషయాన్ని కూడా గుర్తించారు. మౌత్‌వాష్‌ వంటి ఉత్పత్తులతో నోటిని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకునే వారి టూత్‌బ్రష్‌లపై తక్కువ సూక్ష్మజీవులు ఉన్నాయని తెలుసుకున్నారు. మీరు నోటి శుభ్రత పాటిస్తే, మీ టూత్‌బ్రష్‌ కూడా శుభ్రంగా ఉంటుందని పరిశోధకురాలు హెరికా హార్ట్‌మాన్‌ అభిప్రాయపడ్డారు. అయితే, టూత్‌బ్రష్‌లపై బాక్టీరియాను చూసి ఆందోళన చెందనవసరం లేదని, దంతవైద్యులు సిఫార్సు చేస్తేతప్ప సూక్ష్మజీవులను చంపే ప్రత్యేక పేస్టులు, బ్రష్‌లను వాడకూడదని సూచిస్తున్నారు. అనసరంగా ఇలాంటివి వాడటం వల్ల తట్టుకునే సామర్థ్యాన్ని బాక్టీరియాకు కల్పించిన వారు అవుతారని హెచ్చరించారు. కేవలం నోటిని శుభ్రంగా ఉంచుకునేందుకు సాధారణంగా వాడే టూత్‌పేస్ట్‌ సరిపోతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి..
నిద్రపోయే ముందు వీటికి దూరం
ఈ పుస్తకం మనిషని చంపేస్తుంది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని