Thailand: గబ్బిలాలను తింటూ వీడియో.. యువతి అరెస్టు!

గబ్బిలాలతో కూడిన సూప్‌ తాగుతూ, వాటిని తుంచుకుని తింటున్నట్లు వీడియో పోస్ట్‌ చేసిన ఓ థాయ్‌లాండ్‌ యువతిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఫోంచనోక్ శ్రీసునక్లువా అనే ఓ యువతి ఇటీవల తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఈ మేరకు ఓ వీడియో పోస్ట్‌ చేసింది.

Published : 13 Nov 2022 01:33 IST

బ్యాంకాక్‌‌: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌.. గబ్బిలాల నుంచి మరో జంతువు ద్వారా మానవుల్లోకి వ్యాపించి ఉంటుందని అధ్యయనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇటువంటి ప్రమాదకర విషయాన్ని బేఖాతరు చేస్తూ.. చనిపోయిన గబ్బిలాలతో కూడిన సూప్‌(Bat Soup) తాగుతూ, వాటిని తుంచుకుని తింటున్నట్లు వీడియో పోస్ట్‌ చేసిన ఓ థాయ్‌లాండ్‌(Thailand) యువతిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఫోంచనోక్ శ్రీసునక్లువా అనే యువతి ఇటీవల తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఈ మేరకు ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఈ ఆహారాన్ని ఆమె రుచికరమైనదిగా పేర్కొనడం గమనార్హం.

మొదటిసారి తాను ఈ జీవులను తింటున్నట్లు, ఉత్తర థాయ్‌లాండ్‌లోని లావోస్ సరిహద్దు సమీప మార్కెట్ నుంచి వాటిని కొనుగోలు చేసినట్లు వీడియోలో తెలిపింది. అయితే, కొవిడ్‌ కారక ‘సార్స్‌-కోవ్‌-2’ను పోలిన వైరస్‌తో కూడిన గబ్బిలాలు ఈ ప్రాంతంలోనే కనిపిస్తాయని స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. ఈ క్రమంలోనే ఆమె వీడియోపై యూట్యూబ్‌లో, నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అనేక మంది ఆరోగ్య సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తారు. ‘ఒకవేళ చనిపోవాలనుకుంటే.. ఒంటరిగా చనిపోండి. ఎవరూ ఏమనరు. కానీ, మహమ్మారి ప్రబలితే మాత్రం మీరే బాధ్యులు’ అని ఓ నెటిజన్‌ పేర్కొన్నారు.

ఈ వీడియో చూసి షాక్‌కు గురైనట్లు.. స్థానిక వన్యప్రాణుల ఆరోగ్య నిర్వహణ విభాగం హెడ్‌ పటరాపోల్ మనీయోర్న్ తెలిపారు. గబ్బిలాలను తింటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. ఈ వ్యవహారం కాస్త చర్చనీయాంశంగా మారడంతో.. ఆమె తన ఛానల్‌ నుంచి ఆ వీడియోను తొలగించింది. అయితే, వన్యప్రాణుల సంరక్షణ, కంప్యూటర్ సంబంధిత నేరాల చట్టాలను ఉల్లంఘించినందుకుగానూ.. స్థానిక పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఒకవేళ ఆమె దోషిగా తేలితే ఐదేళ్లవరకు జైలు శిక్ష, లేదా 5 లక్షల బాత్‌(రూ.11.19 లక్షలు)ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని