Ts High Court: వైఎస్‌ షర్మిల బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించవద్దు: హైకోర్టు

వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బయటకు వెళ్లకుండా ఎలాంటి ఆంక్షలు విధించొద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ధర్మాసనం సూచించింది.

Updated : 14 Dec 2022 17:29 IST

హైదరాబాద్: వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకోరాదని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. షర్మిల ఇంటి వద్ద బ్యారికేడ్లను తొలగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు ఆదేశించినప్పటికీ పాదయాత్రకు వెళ్లకుండా తనను గృహ నిర్బంధం చేశారంటూ షర్మిల ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. గృహ నిర్బంధం చేసి వ్యక్తిగత స్వేచ్ఛను పోలీసులు కాలరాస్తున్నారని షర్మిల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. కార్యకర్తలను కూడా పార్టీ కార్యాలయానికి రానీయడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ప్రగతిభవన్ ముట్టడి, అనుమతి లేకుండా రాజ్‌భవన్‌కు వెళ్లడం వంటి ఘటనలతో షర్మిల శాంతిభద్రతలు, ట్రాఫిక్ రాకపోకలకు విఘాతం కలిగించారని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, షర్మిల నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవచ్చు కానీ.. ఆ కారణం చూపించి ఆమెను గృహ నిర్బంధం చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే.. పాదయాత్రలు, ధర్నాలు, ప్రదర్శనలు చేపట్టాలని షర్మిలను హైకోర్టు ఆదేశించింది. లోటస్ పాండ్ వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు తొలగించి వాహనాల రాకపోకలు పునరుద్ధిరించాలని హైకోర్టు ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని