బీర్‌ వైరస్‌.. అన్న నేతకే కరోనా

కొవిడ్‌ను బీర్‌ వైరస్‌ అంటూ తేలికగా తీసుకున్న ఓ అమెరికా నేతకే కొవిడ్‌-19 సోకింది. 

Published : 14 Nov 2020 01:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ తీవ్రతను తక్కువ అంచనా వేసి.. బీర్‌ వైరస్‌ అంటూ దాన్ని తేలిగ్గా తీసుకున్న ఓ అమెరికా నేతకే ఇప్పుడు అది సోకింది. అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన అలస్కా సీనియర్‌ కాంగ్రెస్‌ సభ్యుడు డాన్‌ యంగ్‌ ఈ సంగతిని స్వయంగా సామాజిక మాధ్యమాల్లో ప్రకటించటం గమనార్హం. ‘‘నాకు కొవిడ్-19 పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. నేను నిబంధనలను పాటిస్తూ.. అలస్కాలో ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నాను. ఈ సమయంలో ఒంటరిగా ఉండాలని భావిస్తున్నాను. నేను ఆరోగ్యంగానే ఉన్నాను’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. కాగా, అలస్కాలో కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉందని.. ఆరోగ్య, ప్రజా రక్షణ వ్యవస్థలు ప్రభావితమయ్యే అవకాశముందని హెచ్చరికలు జారీకావటం గమనార్హం.

87 ఏళ్ల యంగ్‌ ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించి 25వ సారి కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. తద్వారా సుదీర్ఘకాలం శాసన సభ్యుడిగా ఉన్న నేతగా రికార్డు సృష్టించారు. కొవిడ్‌ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అప్పుడే పడగ విప్పుతున్న సమయంలో.. ఈ వ్యాధి కేవలం ప్రజల భయం నుంచి పుట్టిందని, దానికి అంత ప్రాముఖ్యం ఇవ్వనవసరం లేదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ‘కరోనా బీర్‌’ పేరుతో ఒక బీరు కూడా ఉండటంతో.. దానిని ‘బీర్‌ వైరస్‌’ అని పిలుస్తానని అప్పట్లో ప్రకటించారు.

ఇదిలా ఉండగా, కరోనా గురించి ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. నిజం, నిజమేనని అలస్కా గవర్నర్‌ మైక్‌ డన్లీవీ పేర్కొన్నారు. కొవిడ్‌ బాధితులు, దాని బారిన పడుతున్న ఆరోగ్య సేవల సిబ్బంది సంఖ్య కూడా అంచనాలకు అందనంతగా పెరుగుతోందని.. ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన హెచ్చరిక జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు