Corona: కొవిడ్‌ నిబంధనల కొనసాగింపు

కొవిడ్‌ మహమ్మారిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా వివిధ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ లేదా కర్ఫ్యూ వంటి నిబంధనలను

Published : 31 May 2021 10:23 IST

రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూల పొడిగింపు

దిల్లీ: కొవిడ్‌ మహమ్మారిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా వివిధ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ లేదా కర్ఫ్యూ వంటి నిబంధనలను 7 నుంచి 15 రోజుల పాటు పొడిగించాయి. కేసులు తగ్గుముఖం పట్టిన కొన్నిచోట్ల నిబంధనలను సడలించారు. ఇప్పటికే కేరళ, పుదుచ్చేరి, మిజోరం (ఆయ్‌జోల్‌)లలో లాక్‌డౌన్‌ వారం పాటు పొడిగించగా గోవాలో కర్ఫ్యూని కొనసాగిస్తూ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పలు రాష్ట్రాలు ప్రకటనలు చేశాయి. కొన్ని రాష్ట్రాలు వాణిజ్య సంస్థలు వంటివాటికి సడలింపులు ఇచ్చాయి. అయితే అన్నిచోట్ల విద్యాసంస్థలను మాత్రం తెరవడం లేదు.
ఇతర నిబంధనలు..

ఉత్తర్‌ప్రదేశ్‌లో జూన్‌ 1 నుంచి దుకాణాలు, మార్కెట్లకు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు అనుమతిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. రాజధాని లఖ్‌నవూతో పాటు 20 జిల్లాల్లో మాత్రం ఈ సడలింపు ఇవ్వలేదు. రాష్ట్రమంతటా రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌లు అమలవుతాయి.

జమ్మూ-కశ్మీర్‌లో అన్‌లాక్‌ ప్రక్రియను ప్రారంభించారు. రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌లు మాత్రమే కొనసాగుతాయి.

మధ్యప్రదేశ్‌లో జూన్‌ 1 నుంచి దశలవారీగా కరోనా కర్ఫ్యూను సడలించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. వారాంతపు లాక్‌డౌన్‌ మాత్రం కొనసాగుతుంది. అధికారులు 100%, సిబ్బంది 50% హాజరుకు అనుమతిస్తూ కార్యాలయాలు పనిచేస్తాయి.

పంజాబ్‌లో కొవిడ్‌ నిబంధనలను జూన్‌ 10 వరకు పొడిగించారు. - పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం జూన్‌ 15 వరకు నిబంధనలను పొడిగించింది.

గుజరాత్‌లోని 36 నగరాల్లో రాత్రి కర్ఫ్యూని జూన్‌ 4 వరకు పొడిగించారు. 

మణిపుర్‌లోని 7 జిల్లాల్లో జూన్‌ 11 వరకు కర్ఫ్యూ విధించారు.

త్రిపురలో అగర్తలాతో పాటు అన్ని నగరపాలక సంస్థల పరిధిలో జూన్‌ 5 వరకు కరోనా కర్ఫ్యూ పొడిగించారు. 

హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం జూన్‌ 7 వరకు కొవిడ్‌ నిబంధనలను పొడిగించింది.
లాక్‌డౌన్‌లు..

మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ తరహా నిబంధనలను జూన్‌ 1 నుంచి 15 రోజుల పాటు పొడిగించారు. అయితే కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఝార్ఖండ్‌లో జూన్‌ 3 వరకు లాక్‌డౌన్‌ విధించారు.

> అరుణాచల్‌ప్రదేశ్‌లోని 6 జిల్లాల్లో జూన్‌ 7 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించారు.

ఒడిశాలో జూన్‌ 17 వరకు (16 రోజులు); రాజస్థాన్‌లో 8 వరకు; తమిళనాడు, కర్ణాటక, సిక్కిం, హరియాణా, మేఘాలయ(ఒక జిల్లాలో)ల్లో 7వ తేదీ వరకు (వారం పాటు); నాగాలాండ్‌లో 11 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. సిక్కింలో దుకాణాలు, వ్యవసాయ కార్యకలాపాలకు మాత్రం సడలింపులు ఇచ్చారు. హరియాణాలో సరి-బేసి విధానంలో దుకాణాలకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని