Updated : 29 Dec 2020 11:31 IST

భారత్‌లోకి కరోనా ‘కొత్త రకం’ 

బ్రిటన్‌ నుంచి వచ్చిన ఆరుగురిలో నిర్ధారణ

దిల్లీ: బ్రిటన్‌లో వెలుగుచూసి ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోన్న కరోనా ‘కొత్త రకం’ వైరస్‌ భారత్‌లోకి ప్రవేశించింది. దేశంలో ఆరు కేసులు నమోదయ్యాయి. ఇటీవల యూకే నుంచి వచ్చిన ఆరుగురిలో కొత్తగా మార్పు చెందిన కరోనా వైరస్‌ ఉన్నట్లు తాజాగా తేలింది. బెంగళూరులోని నింహన్స్‌లో మూడు, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో రెండు, పుణెలోని ఎన్‌ఐవీలో ఒక కేసు నిర్ధారణ అయినట్లు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ అధికారంగా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఆరుగురిని ఆయా రాష్ట్రాల్లో సింగిల్‌ రూం ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపింది. మరోవైపు కొత్తరకం కేసులు నిర్ధారణ అయిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ఆరుగురి తోటి ప్రయాణికులు, కుటుంబసభ్యులును ట్రేసింగ్‌ చేస్తోంది. 

యూకేలో కొత్త రకం వైరస్‌ ఆందోళనకరంగా మారిన సమయంలో భారత్‌లో ఈ కేసులు వెలుగుచూడటం కలవరపెడుతోంది. ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లో కరోనా కొత్తరకం విజృంభిస్తుండటంతో అక్కడ ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్త రకం వైరస్‌ 70శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే భారత్‌ సహా పలు దేశాలు యూకేకు విమానసర్వీసులు నిలిపివేశాయి.

భారత్‌లో ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి 31 వరకు బ్రిటన్‌కు విమానాల రాకపోకలను నిలిపివేశారు. అయితే 23 అర్ధరాత్రిలోగా భారత్‌కు చేరుకున్నవారికి ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులకు సోకింది కొత్త రకమా? కాదా? అన్నది తెలుసుకునేందుకు వారి రక్తనమూనాలను వైరాలజీ ల్యాబ్‌లకు పంపించారు. తాజాగా ఈ ఫలితాలు వెలువడగా.. యూకే నుంచి వచ్చిన ఆరుగురిలో కొత్త రకం వైరస్‌లను గుర్తించినట్లు తేలింది. ఇదిలా ఉండగా.. నవంబరు 25 నుంచి డిసెంబరు 23 వరకు బ్రిటన్‌ నుంచి దాదాపు 33 వేల మంది ప్రయాణికులు వేర్వేరు విమానాశ్రయాల గుండా భారత్‌కు చేరుకున్నారు. వీరందరినీ ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తించి వీరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ నేడు వెల్లడించింది. ఇప్పటివరకు యూకే నుంచి వచ్చిన వారిలో 114 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపింది. 

మరోవైపు కొత్తరకం వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొవిడ్‌ ఆంక్షలను జనవరి 31 వరకు పొడగిస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల స్థానిక పరిస్థితులను బట్టి కరోనా వ్యాప్తి నియంత్రణకు రాత్రిపూట కర్ఫ్యూ లాంటి ఆంక్షలు విధించుకోవచ్చని సూచించింది. అయితే రాష్ట్రాల మధ్య, రాష్ట్ర పరిధిలోని వ్యక్తులు, వాహనాల రాకపోకలపై పరిమితులు విధించకూడదని స్పష్టం చేసింది. 

ఇవీ చదవండి..

బ్రిటన్‌లో ఆసుపత్రులు కిటకి

ఆ 156 మంది ఎక్కడ?


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని