సూకిపై మరో నేరం.. అందుకేనా?

కోర్టు విచారణ లేకుండా మహిళా నేతను నిరవధికంగా  నిర్బంధంలో ఉంచేదుకే

Published : 16 Feb 2021 22:49 IST

బౌద్ధ భిక్షువుల నిరసన ప్రదర్శనలు

నయ్‌పైటా: మయన్మార్‌ ప్రజా నేత ఆంగ్‌ సాన్‌ సూకిపై ఆ దేశ పోలీసులు మరో నేరం ఆరోపించారు. కోర్టు విచారణ లేకుండా మహిళా నేతను నిరవధికంగా నిర్బంధంలో ఉంచినందుకే వారు ఈ విధంగా చేశారని.. ఆమె తరపు న్యాయవాది ఖిన్‌ మౌంగ్‌ జా నేడు వెల్లడించారు. సూకి కరోనా వైరస్‌ నియమాలను ఉల్లంఘించారంటూ.. ఆర్టికల్‌ 25 కింద ఆమెపై నేరం మోపారు. పదవిని కోల్పోయిన ఆ దేశాధ్యక్షుడు విన్‌ మయింట్‌పై కూడా అదే నేరారోపణ చేశారు.  ఈ నేరం రుజువైతే గరిష్టంగా మూడేళ్ల  శిక్ష పడనుంది. కానీ అరెస్టైన వారిని న్యాయస్థానంలో హాజరు పర్చకుండా ఎంతకాలమైనా అదుపులో ఉంచవచ్చంటూ సైనిక ప్రభుత్వం సవరించిన నియమాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.  అనుమతి లేని వాకీటాకీలను కలిగి ఉన్నారనే నేరంపై ఆమెను ఫిబ్రవరి 1న సైన్యం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

రెండో రోజూ ఇంటర్నెట్‌ నిషేధం

దేశంలో వరుసగా రెండో రోజు ఇంటర్నెట్‌పై నిషేధం కొనసాగుతోంది.  కఠిన శిక్షలుంటాయనే ప్రకటనలకు వెరవని మయన్మార్‌ ప్రజలు, నాయకురాలు తమ సూకి విడుదలను డిమాండ్‌ చేస్తూ నేడు కూడా వీధుల్లో ప్రదర్శనలను కొనసాగించారు. ప్రధాన నగరం యాంగూన్‌లో పోలీసులు వీధులను మూసివేశారు. ఇక ఆ దేశంలోని బౌద్ధ భిక్షువులు కూడా ఐరాస కార్యాలయం ఎదుట ప్రదర్శన చేపట్టారు.

సోమవారం మాండలేలో  ప్రదర్శకులపై సైన్యం లాఠీఛార్జి, రబ్బర్ ‌తూటాలను ప్రయోగించింది. మయన్మార్‌ నిరసనకారుల పట్ల సైనికులు వ్యవహరిస్తున్న వైఖరి సరికాదని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. అయినా ఆ నగరంలో ఈ రోజు  మూడు వేల మందికి పైగా విద్యార్థులు, ప్రదర్శకులు సూకీ పోస్టర్లను ధరించి మరీ నిరసనలు తెలపడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని