Afghanistan: ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్‌ అగ్రనేతల మంతనాలు

అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు క్రతువుపై తాలిబన్‌ అగ్రనేతలు మంతనాలు సాగిస్తున్నారు.

Published : 22 Aug 2021 16:20 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు క్రతువుపై తాలిబన్‌ అగ్రనేతలు మంతనాలు సాగిస్తున్నారు. కొంతకాలంగా కతార్‌లో తలదాచుకుంటున్న తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ రాజకీయ విభాగాధిపతి ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ శనివారం కాబుల్‌ చేరుకున్నాడు. చైనా చెప్పినట్టు అఫ్గాన్‌లోని అన్ని జాతులతో కూడిన సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే విషయమై ఇతర ముఖ్య నేతలతో మంతనాలు సాగించాడు. త్వరలోనే జిహాదీ, రాజకీయ నేతలతోనూ బరాదర్‌ సమావేశం కానున్నట్టు తాలిబన్‌ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. నిజానికి బరాదర్‌ గత మంగళవారమే దేశంలోని రెండో అతిపెద్ద నగరం, తాలిబన్‌ పుట్టిల్లు కాందహార్‌ చేరుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే... ఈసారి తమ పరిపాలన విభిన్నంగా ఉంటుందని, ప్రజలకు భద్రత కల్పిస్తామని, మహిళల హక్కులను పరిరక్షిస్తామని తాలిబన్లు ప్రకటించారు.

కాబుల్‌లో ‘అమెరికా మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌’

తాజా పరిణామాల క్రమంలో హక్కానీ నెట్‌వర్క్‌ నేతలు క్రియాశీలకంగా మారుతున్నారు. అమెరికా నేతృత్వంలోని నాటో దళాలకూ, అఫ్గాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సంస్థ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. ఈ నెట్‌వర్క్‌ అగ్రనేత, అమెరికా మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌గా ప్రాచుర్యం పొందిన ఖలీల్‌ హక్కానీ శనివారం కాబుల్‌ చేరుకున్నాడు. ఖలీల్‌ తలకు అమెరికా గతంలో రూ.37 కోట్ల రివార్డు ప్రకటించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని