మహారాష్ట్రకు అంగుళం భూమి కూడా ఇవ్వం

కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం మళ్లీ రాజుకుంది. కర్ణాటకలో ఉన్న మరాఠా ప్రాంతాలను తిరిగి సాధిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటన చేయడం వివాదానికి తెరతీసింది. ఈ ప్రకటనను

Updated : 18 Jan 2021 15:02 IST

ఠాక్రే ప్రభుత్వ ప్రకటనను ఖండించిన యడియూరప్ప

బెంగళూరు: కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం మళ్లీ రాజుకుంది. కర్ణాటకలో ఉన్న బెళగావి..తదితర ప్రాంతాలను తిరిగి సాధిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించడం వివాదానికి తెరతీసింది. ఈ ప్రకటనను కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తీవ్రంగా ఖండించారు. ఇది చాలా దురదృష్టకరమన్న యడ్డీ.. తమ రాష్ట్రంలోని అంగుళం భూమిని కూడా వదులుకోబోమని మరోసారి స్పష్టం చేశారు. 

‘సరిహద్దు అంశంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యలు అనుచితం. సమాఖ్య వ్యవస్థకు విరుద్ధం. కర్ణాటకలో మహారాష్ట్రీయులు.. కన్నడిగులు సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తున్నారు. ప్రజల్లో శాంతి సౌభ్రాతృత్వాలకు భంగం కలిగించేలా ఉన్న ఠాక్రే వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నిజమైన భారతీయుడిగా ఫెడరల్‌ స్ఫూర్తికి, విధానాలకు ఠాక్రే గౌరవం ఇవ్వాలని, వాటికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నా’ అని యడియూరప్ప ట్విటర్‌లో పేర్కొన్నారు. 

ఒకప్పుడు బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న బెళగావి.. తదితర ప్రాంతాలు ఆ తర్వాత మైసూరు రాష్ట్రంలో కలిశాయి. అక్కడ ఎక్కువ మంది ప్రజలు మరాఠీనే మాట్లాడతారు. కాబట్టి వాటిని తమ రాష్ట్రంలో కలపాలంటూ మహారాష్ట్ర డిమాండ్‌ చేస్తోంది. దీనిపై బెళగావి కేంద్రంగా 1948లో ఏర్పడిన మహారాష్ట్ర ఏకీకరణ సమితి పోరాటం కొనసాగిస్తోంది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు జనవరి 17న ఆ ప్రాంతాలను కర్ణాటకలో కలిపారు. దీనికి వ్యతిరేకంగా మహారాష్ట్ర ఏకీకరణ సమితి ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ సంస్థ ఏటా జనవరి 17న అమర వీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటోంది. 

ఈ నేపథ్యంలోనే నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కార్యాలయం ట్విటర్‌లో సంచలన ప్రకటన చేసింది. ‘‘కర్ణాటక ఆక్రమించిన మరాఠీ ప్రాంతాలను తిరిగి మహారాష్ట్రలో కలపడమే ‘సరిహద్దు యుద్ధ’ అమరవీరులకు ఇచ్చే నిజమైన నివాళి. దాన్ని సాధించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని అందులో పేర్కొనడం చర్చనీయాంశమైంది.

ఇవీ చదవండి..

శామ్‌సంగ్‌ వారసుడికి రెండున్నరేళ్ల జైలుశిక్ష 

27 నగరాల్లో మెట్రో రైలు.. మోదీ

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు