రష్యా టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌..?

స్పుత్నిక్‌-వి టీకా ప్రయోగాల్లో పాల్గొన్న ప్రతి ఏడుగురు వాలెంటీర్లలో ఒకరికి ఇతర దుష్ప్రభావాలు వస్తున్నట్టు తెలిసింది.

Published : 19 Sep 2020 01:14 IST

సాధారణమే అంటున్న నిపుణులు

దిల్లీ: కరోనా వైరస్‌ కట్టడికి రష్యా తయారుచేసిన స్పుత్నిక్‌-వి టీకా ప్రయోగాల్లో పాల్గొన్న ప్రతి ఏడుగురు వాలెంటీర్లలో ఒకరికి సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తున్నట్టు తెలిసింది. ఈ టీకా‌ ప్రయోగించిన వారిలో 14 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపించినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్‌ మురాష్కో తెలిపారు. అయితే, ఆ లక్షణాలు మర్నాటి కల్లా సర్దుకున్నాయని ఆయన వివరించారు. స్పుత్నిక్-వి‌ టీకా తీసుకున్న అనంతరం సగటున ఏడుగురిలో ఒకరికి బలహీనత, ఒంటినొప్పులు వంటి లక్షణాలు కనిపించాయని ఆయన వెల్లడించారు.

స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ ప్రయోగానికి సంబంధించిన ప్రాథమిక ఫలితాలు ఇటీవల లాన్సెట్ మెడికల్‌‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం వ్యాక్సిన్‌ ఇచ్చిన భాగంలో నొప్పి (58% మందికి), విపరీతమైన జ్వరం (50% మందికి), తలనొప్పి (42% మందికి), బలహీనత (28% మందికి), నీరసం (24% మందికి), కండరాలు, కీళ్లనొప్పులు (24% మందికి) వంటి లక్షణాలు కనిపించాయి. తొలి 42 రోజుల్లో కనిపించిన ఈ ప్రభావాలు చిన్నపాటివేనని లాన్సెట్‌ తెలిపింది. ప్రత్యేకించి వైరస్‌లతో వచ్చే‌ వ్యాధులకు సంబంధించిన ఏ ఇతర వ్యాక్సిన్‌లోనైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని సంస్థ తెలిపింది.
కాగా, స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను ప్రజలు వినియోగించేందుకు రష్యా ఆరోగ్యశాఖ ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని రష్యా భావిస్తోంది. అయితే, రష్యా ఇప్పటికి రెండు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ను మాత్రమే విజయవంతంగా పూర్తి చేసుకుంది. మూడో దశ ప్రయోగాలను భారత్‌, తదితర దేశాల్లో కూడా చేపట్టాలని భావిస్తోంది. సౌదీ అరేబియా, బ్రెజిల్‌, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌ లాంటి దేశాలు ఈ టీకా మూడో దశ ప్రయోగాలకు ఇప్పటికే అనుమతించాయి. తొలి రెండు దశల ప్రయోగాలు విజయవంతం కావటంతో భారత నిబంధనలకు అనుగుణంగా దేశంలో మూడోదశ ప్రయోగాలు చేపట్టనున్నట్టు రెడ్డీస్‌ ఎండీ జీవీ ప్రసాద్‌ వెల్లడించారు. భారత ప్రభుత్వ అనుమతులు లభించిన అనంతరం 100 మిలియన్‌ డోసులు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌కు అందించనున్నట్టు రష్యన్‌ డైరక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని