కొవిడ్‌ ముప్పు: 10రెట్ల వేగంతో వ్యాపించే వైరస్‌..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి కొత్తపుంతలు తొక్కుతోంది. తాజాగా కొవిడ్‌ 19 వైరస్‌ D614G రకం ఉత్పరివర్తనం (మ్యుటేషన్) బయటపడినట్లు మలేషియా పరిశోధకులు వెల్లడించారు.

Updated : 17 Aug 2020 17:04 IST

మలేషియాలోనూ బయటపడ్డ D614G రకం మ్యుటేషన్‌!
ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ముమ్మరం

కౌలాలంపూర్‌: ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి కొత్తపుంతలు తొక్కుతోంది. తాజాగా కొవిడ్‌ 19 వైరస్‌ D614G రకం ఉత్పరివర్తనం (మ్యుటేషన్) బయటపడినట్లు మలేషియా పరిశోధకులు వెల్లడించారు. అత్యంత వేగంగా వ్యాపించే ప్రభావం ఉన్న ఈ వైరస్‌ను ఎదుర్కోవడంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఈ తరహా మ్యుటేషన్‌ ఇప్పటికే పలుదేశాల్లో బయటపడ్డట్లు నిపుణులు పేర్కొన్నారు.

చైనాలో పుట్టిన వైరస్‌ రూపాంతరం చెందుతూ ప్రపంచదేశాలను సంక్షోభంలోకి నెట్టేసింది. ఇప్పటికే ఈ వైరస్‌ ఎన్నో ఉత్పరివర్తనాలు చోటుచేసుకున్నట్లు గుర్తించారు. అయితే వాటి స్వభావం, తీవ్రతపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా ప్రమాదకరంగా భావిస్తోన్న D614G రకం మ్యుటేషన్‌ను మలేషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ గుర్తించింది. ఎవరైనా సూపర్‌ స్ప్రెడర్‌తో ఈ వైరస్‌ అత్యంత సులభంగా, 10రెట్ల వేగంతో ఇతరులకు సోకుతుందని మలేషియా ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ నూర్‌ హిషమ్‌ అబ్దుల్లా ప్రకటించారు. అయితే బయటపడిన రెండు క్లస్టర్లలోనూ మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైరస్‌ కట్టడికి తీసుకున్న పకడ్బందీ చర్యలవలన పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

అయితే, D614G రకం మ్యుటేషన్‌ను జులై నెలలోనే కనుగొన్నారు. ఈ తరహా మ్యుటేషన్‌పై వ్యాక్సిన్లు ఎంతవరకు పనిచేస్తాయనే విషయంపై ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. ‘కరోనా’ కొమ్ము ప్రొటీన్‌లోని ‘D614G’ మార్పుల వల్ల ఈ వైరస్‌ కొత్తరూపాన్ని ధరించిందని అమెరికాలోని లాస్‌ ఆల్మోస్‌ నేషనల్‌ లేబొరేటరీ పరిశోధకులు ఇటీవల వెల్లడించారు. బ్రెజిల్‌, ఐరోపా, మెక్సికో, వుహాన్‌లలో ఇప్పటికే ఏడు ‘D614G’ రకాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో వైరస్‌ ఉత్పరివర్తనపై శాస్త్ర సమాజంలో విస్తృత చర్చ జరుగుతోంది. ఇలాంటి వైరస్‌ మ్యుటేషన్‌ చెందుతూ తన జన్యుక్రమాన్ని మార్చుకోవడం ఔషధాలు, వ్యాక్సిన్‌ల తయారీకి పెను సవాలుగా మారుతుందని కొందరు శాస్త్రవేత్తల ఆందోళన చెందుతున్నారు. అయితే, మ్యుటేషన్‌ సహజమని, ప్రమాదకరమేమీ కాదని మరికొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘D614G’ ఉత్పరివర్తనపై మరింత పరిశోధన అవసరమని టీకా అభివృద్ధికి ఇది పెద్ద అవరోధం కాబోదని ఆస్ట్రేలియాలోని భారత సంతతి శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ శేషాద్రి వాసన్‌ అభిప్రాయపడ్డారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రజలు భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి వ్యక్తిగత చర్యలు కచ్చితంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని