Mount Everest: ఎవరెస్ట్‌పై కరోనా పంజా!

కరోనా వైరస్‌ ఎవరెస్ట్‌ శిఖరాన్ని సైతం తాకింది. దాదాపు 100 మంది పర్వాతారోహకులు, సిబ్బందికి కొవిడ్‌ సోకినట్లు ఓ పర్వతారోహ నిపుణుడు పేర్కొన్నారు....

Published : 25 May 2021 01:19 IST

బేస్‌క్యాంప్‌లోని 100 మందికి పాజిటివ్‌

కాఠ్‌మాండూ: కరోనా వైరస్‌ ఎవరెస్ట్‌ శిఖరాన్ని సైతం తాకింది. దాదాపు 100 మంది పర్వాతారోహకులు, సిబ్బందికి కొవిడ్‌ సోకినట్లు ఓ పర్వతారోహ నిపుణుడు పేర్కొన్నారు. శనివారం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా ఓ విదేశీ గైడ్‌ సహా ఆరుగురు నేపాలీ గైడ్‌లకు పాజిటివ్‌గా తేలినట్లు ప్రముఖ పర్వాతారోహణ నిపుణుడు, ఆస్ట్రియాకు చెందిన లుకాస్ ఫుర్టెన్‌బాచ్ పేర్కొన్నారు. వైరస్ కారణంగా తన ఎవరెస్ట్ యాత్రను వాయిదా వేసుకున్నట్లు వెల్లడించారు.

కాఠ్‌మాండూలోని ఓ ప్రెస్‌క్లబ్‌లో లుకాస్‌ మాట్లాడుతూ..‘ఎవరెస్ట్‌ బేస్‌క్యాంప్‌లో 100 మందికి పైగానే కరోనా బారినపడినట్లు కనిపిస్తోంది. ఇందులో పర్వతారోహకులు, సహాయ సిబ్బంది, రెస్క్యూ పైలెట్లు, వైద్యులు, ఇన్సూరెన్స్‌ సంస్థకు చెందిన వారు ఉన్నారు. బేస్‌క్యాంప్‌లోని టెంట్లలో అనారోగ్యంతో బాధపడుతున్నవారిని ఎంతోమందిని నా కళ్లారా చూశాను’ అని ఆయన పేర్కొన్నారు.

నేపాల్ పర్వతారోహణ అధికారులు మాత్రం లుకాస్‌ ఆరోపణలను ఖండించారు. ఈ సీజన్‌లో బేస్‌క్యాంప్‌లోని ఎవరికి కూడా కొవిడ్‌ సోకలేదని పేర్కొన్నారు.
ఈ సీజన్‌లో మొత్తం 408 మంది విదేశీ పర్వతారోహకులకు ఎవరెస్ట్ ఎక్కేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అనేక మంది సహాయ సిబ్బంది, మరికొంత మంది స్టాఫ్‌ ఏప్రిల్‌ నుంచే బేస్‌క్యాంప్‌లో ఉంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని