
Corona: కేరళలో ఒకేరోజు 54 వేలకు పైగా కేసులు.. 352 మంది మృతి
ఇంటర్నెట్ డెస్క్: కేరళలో కొవిడ్ ఉద్ధృతి పెరుగుతోంది. తాజాగా మళ్లీ 50 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1.15 లక్షల టెస్టులు చేయగా.. 54,534 కేసులు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. అలాగే, కొవిడ్ బాధితుల్లో 30,225 మంది కోలుకోగా, 352 మంది మృతిచెందినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,33,447 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు మహారాష్ట్రలోనూ భారీగా మరణాలు నమోదయ్యాయి. శుక్రవారం 24,948 మంది కొవిడ్ బారిన పడగా.. ఏకంగా 103 వైరస్ సంబంధిత మరణాలు చోటుచేసుకున్నాయి. గత అక్టోబర్ తర్వాత మహారాష్ట్రలో ఇవే అత్యధిక మరణాలు. తాజా కేసుల్లో 110 ఒమిక్రాన్‌గా నిర్ధరణ అయ్యాయి. పాజిటివిటీ రేటు 10.32 శాతంగా నమోదైంది. రాజధాని ముంబయిలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 1312కి వైరస్ సోకగా 10 మంది మరణించారు. 14,344 యాక్టివ్ కేసులున్నాయి.
గడిచిన 24 గంటల్లో కర్ణాటకలో 31,198 మందికి వైరస్ నిర్ధరణ అయ్యింది. 50 మంది మృత్యువాతపడ్డారు. పాజిటివిటీ రేటు 20.91శాతంగా ఉంది. అయితే రాష్ట్రంలోని దాదాపు సగం కేసులు రాజధాని నుంచే ఉన్నాయి. బెంగళూరులో 15,199 కేసులు వెలుగుచూశాయి. అయితే బయటపడిన కేసుల్లో అత్యధికంగా డెల్టా వేరియంట్‌వే ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డా.కె.సుధాకర్ వెల్లడించారు. ఆ తర్వాతి స్థానంలో ఒమిక్రాన్ కేసులు ఉన్నట్లు తెలిపారు.