ఒక్కరోజులో వెయ్యి మంది కోలుకున్నారు

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. మరోవైపు ఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా.......

Published : 04 May 2020 17:33 IST

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 11,706 మంది

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. మరోవైపు ఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,074 మంది కోలుకోవడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ స్థాయిలో కోలుకోవడం ఇదే ప్రథమమని కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.  రికవరీ రేటు 27.52 శాతంగా నమోదైందని ఆ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఇప్పటి వరకు మొత్తంగా 11,706 మంది కోలుకున్నారని చెప్పారు. ఈ మేరకు ఆయన సంయుక్త మీడియా సమావేశంలో సోమవారం మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,553 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాని, మొత్తం కేసుల సంఖ్య 42,533కు చేరిందని తెలిపారు. ప్రస్తుతం కేసుల సంఖ్య స్థిరంగా ఉందని, కలిసి పనిచేస్తే కేసుల సంఖ్య పెరుగుదలను అరికట్టవచ్చన్నారు. లేకుంటే కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని లవ్‌ అగర్వాల్‌ హెచ్చరించారు.

సరకు రవాణాకు సహకరించండి..

లాక్‌డౌన్‌ - 3 ఈ నెల 17వరకు కొనసాగనున్న నేపథ్యంలో దేశంలో విమాన, రైలు, మెట్రో రైలు సర్వీసులన్నింటినీ రద్దు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అన్ని ప్రార్థనా స్థలాలతో పాటు మాల్స్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, సెలూన్లు, స్పా సెంటర్లు కూడా మూసే ఉంటాయని స్పష్టంచేసింది. రాష్ట్రాల మధ్య సరకుల రవాణాకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఏదైనా సమస్య ఉంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930, నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1033కి సంబంధిత డ్రైవర్‌/రవాణాదారుడు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి పుణ్య సలిలా శ్రీవాత్సవ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని