Omicron Deaths: ప్రపంచంలో ఒమిక్రాన్‌ మరణాలెన్నంటే?

ప్రపంచ దేశాలను ఒమిక్రాన్‌ వణికిస్తోంది. డెల్టా రకం కన్నా నాలుగు రెట్లు అత్యధికంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగిన ఈ వేరియింట్‌ గతేడాది .......

Updated : 05 Jan 2022 18:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ దేశాలను ఒమిక్రాన్‌ వణికిస్తోంది. డెల్టా రకం కన్నా నాలుగు రెట్లు అత్యధికంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగిన ఈ వేరియింట్‌ గతేడాది నవంబర్‌ 24న తొలిసారి వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీంతో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు 139 దేశాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే, ప్రపంచ దేశాల్లో ఇప్పటిదాక 4,70,462 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా.. ఈ వేరియంట్‌ బారినపడిన వారిలో 108మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. ప్రపంచంలోనే అత్యధికంగా యూకేలో 2,46,780 ఒమిక్రాన్‌ కేసులు నమోదవ్వగా.. ఆ తర్వాత డెన్మార్క్‌లో 57,125, అమెరికా 42,539, జర్మనీ 35,529, కెనడా 21,107, నార్వే 18,352, ఆస్ట్రియా 8,069, ఫ్రాన్స్‌ 5611, ఆస్ట్రేలియా 2765, ఇస్టోనియా 2497, ఇజ్రాయెల్‌ 2336, భారత్‌ 2307, సింగపూర్‌ 2251, థాయిలాండ్‌ 2062, దక్షిణాఫ్రికా 1894 చొప్పున పలు ప్రపంచ దేశాల్లో ఈ కొత్త వేరియంట్‌ కేసులు నమోదైనట్టు కేంద్రం వివరించింది.

ఇక భారత్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్‌ పాకింది. మొత్తంగా 2135 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా.. వారిలో 828మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం మన దేశంలో 1306 క్రియాశీల కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 653 ఒమిక్రాన్‌ కేసులు రాగా.. దిల్లీలో 464, కేరళ 185, రాజస్థాన్‌ 174, గుజరాత్‌ 154, తమిళనాడు 121, తెలంగాణ 84, కర్ణాటక 77, హరియాణా 71, ఒడిశా 37, యూపీ 31, ఆంధ్రప్రదేశ్‌ 24, పశ్చిమబెంగాల్‌ 20 చొప్పున నమోదైనట్టు పేర్కొంది. భారత్‌లో తొలి ఒమిక్రాన్‌ మరణం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నమోదైంది. గత నెలలో ఒమిక్రాన్‌ బారినపడిన 73 ఏళ్ల వృద్ధుడు డిసెంబర్‌ 31న మృతిచెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. డిసెంబర్‌ 15న జ్వరం, దగ్గు, ముక్కులో మంట వంటి లక్షణాలు కనబడటంతో ఆ వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు. అతడికి రెండు సార్లు కొవిడ్‌ పరీక్షలు చేయగా నెగిటివ్‌ వచ్చింది. అదే శాంపిల్‌ని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా పాజిటివ్‌గా వచ్చిందని పేర్కొన్నారు. అతడికి బీపీ, మధుమేహం వంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్టు పేర్కొన్నారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని