Vaccine: ఈ నెల 12కోట్ల డోసులు అందుబాటులో..!

దేశవ్యాప్తంగా జులై నెలలోనే 12కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉండనున్నట్ల కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

Published : 01 Jul 2021 17:45 IST

కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి

దిల్లీ: దేశవ్యాప్తంగా జులై నెలలోనే 12కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉండనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉండే వ్యాక్సిన్‌ డోసులు వీటికి అదనమని పేర్కొంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ కొరత ఉందంటూ భయాలు సృష్టించవద్దని పలు రాష్ట్రాలకు హితవు పలికింది.

‘దేశంలో కొనసాగుతోన్న వ్యాక్సిన్‌ మెగా డ్రైవ్‌పై కొందరు నాయకులు బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తున్నారు. 75శాతం టీకాలను అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది. ఇలా కేవలం జూన్‌ నెలలోనే 11.5కోట్ల డోసులను పంపిణీ చేశాం. అయినప్పటికీ కొరత ఉందంటూ వ్యాక్సినేషన్‌పై దుష్ర్పచారం చేసే నాయకుల ఉద్దేశమేంటో గణాంకాలు చూసి అర్థం చేసుకోవచ్చు’ అని కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్‌ హర్షవర్థన్ పేర్కొన్నారు. జులై నెలలో 12కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని.. ప్రైవేటులో ఉండే డోసులు వీటికి అదనమని చెప్పారు. జులైలో రాష్ట్రాలకు సరఫరా చేసే డోసుల వివరాలను ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు తెలియజేశామని, అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు బాధ్యతారాహిత్య ప్రకటనలు చేస్తూ వ్యాక్సినేషన్‌పై భయాలను సృష్టిస్తున్నాయని ఆరోగ్యశాఖ మంత్రి దుయ్యబట్టారు.

వాస్తవాలు తెలిసీ.. ఇలాంటి ప్రకటనలు చేస్తే అది అత్యంత దురదృష్టకరమని డాక్టర్‌ హర్షవర్ధన్‌ అభిప్రాయపడ్డారు. ఒకవేళ తెలియకపోతే పాలనపైన దృష్టిసారించాలని.. మహమ్మారితో పోరాడుతోన్న సమయంలో ఇలాంటి రాజకీయాలు చేయడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో భయాలు సృష్టించడంపై కాకుండా రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ పంపిణీపై ఎదురవుతున్న సమస్యలపై రాష్ట్ర నాయకులు దృష్టిపెట్టాలని సూచించారు. తమ రాష్ట్రంలో వ్యాక్సిన్‌ కొరత ఏర్పడిందంటూ ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోన్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి ఈ విధంగా స్పందించారు.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 33కోట్ల 57లక్షల డోసులను పంపిణీ చేశారు. వీటిలో 27కోట్ల 60లక్షల మంది తొలి డోసు తీసుకోగా.. 5కోట్ల 96లక్షల మంది రెండు డోసులను అందుకున్నారు. ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్‌లు వినియోగంలో ఉన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని