Assam: కజిరంగ పార్క్‌ను ముంచెత్తిన వరదలు.. వన్యప్రాణులు మృత్యువాత

వరదలు అస్సాంను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటివరకు దీనివల్ల 24 లక్షల మంది ప్రభావితమయ్యారు. 

Published : 08 Jul 2024 13:09 IST

గువాహటి: అస్సాంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. ఆరున్నర లక్షల మంది ఈ వరద బారినపడ్డారు. ఈ వరదల వల్ల అక్కడి కజిరంగ(Kaziranga) నేషనల్‌ పార్క్‌లోని 129 వన్యప్రాణులు మృత్యువాత పడినట్లుగా అధికారులు వెల్లడించారు.

కజిరంగా నేషనల్ పార్క్‌లోకి భారీగా చేరిన వరద నీటిలో ఖడ్గమృగం ఇబ్బందిపడుతున్న వీడియోను రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ(Himanta Biswa Sarma) ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. “ఇటీవల కజిరంగాలో వరద పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నప్పుడు, వరద నీటిలో చిక్కుకొని ఒంటరిగా ఉన్న ఓ ఈ ఖడ్గ మృగాన్ని గమనించి, దానిని వెంటనే రక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించాను. రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదలు మానవులకు, వన్యప్రాణులకు ప్రమాదకరంగా మారాయి. ప్రజల సంరక్షణార్థం రాష్ట్రంలోని సహాయక బృందాల బృందం 24 గంటలు శ్రమిస్తున్నాయి” అని శర్మ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వరదల కారణంగా ఇప్పటివరకు 6 ఖడ్గమృగాలు, 100 హాగ్ జింకలు, రెండు సాంబార్, ఒక ఒట్టర్ సహా 114 వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి. మరికొన్ని హాగ్ జింకలు, ఖడ్గమృగాలు, సాంబార్ సహా 96 వన్యప్రాణులను రక్షించారు. కాగా 2017 సంవత్సరంలో సంభవించిన భారీ వరదలకు ఈ పార్క్‌లోని 350 వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి.

ఈ ఏడాది వరదలకు రాష్ట్రంలో 24 లక్షల మంది ప్రభావితమయ్యారు. బ్రహ్మపుత్ర దాని ఉప నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. కమ్రూప్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వరదలు, కొండచరియలు విరిగిపడడం, తుపానుల కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 64కి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని