Gujarat Tragedy: మోర్బీలో వంతెన కూలిన ఘటన..132కు చేరిన మృతుల సంఖ్య

మోర్బీ నగరంలో మచ్చు నదిపై తీగల వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. త్రివిధ దళాలు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టారు. 

Updated : 31 Oct 2022 15:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గుజరాత్‌లోని మోర్బీ నగరంలో మచ్చు నదిపై తీగల వంతెన కూలిన ఘోర దుర్ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా ఆ సంఖ్య 132కు చేరింది. సహాయక చర్యల కోసం ఇక్కడికి చేరుకొన్న నావికాదళం, వాయుసేన, సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఇప్పటి వరకు 177 మందిని రక్షించినట్లు గుజరాత్‌ సమాచార శాఖ వెల్లడించింది. ఐదు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రాత్రి మొత్తం నదిలో గాలింపు చర్యలను కొనసాగించాయి. తెల్లవారుజామున సైన్యం కూడా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలకు సాయంగా వచ్చింది. మృతదేహాల కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్నట్లు సైన్యానికి చెందిన మేజర్‌ గౌరవ్‌ వెల్లడించారు. 

ఈ ఘటనను గుజరాత్‌ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇవాళ ఉదయం రాష్ట్ర హోంశాఖ మంత్రి హర్ష్‌ సంఘ్వీ మాట్లాడుతూ ఈ ఘటనతో సంబంధం ఉన్నవారిపై క్రిమినల్‌ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతోపాటు ఐదుగురు సభ్యుల కమిటీ.. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తుందన్నారు. బ్రిటిష్‌ కాలం నాటి ఈ వంతెనకు మరమ్మతులు నిర్వహించిన తర్వాత సేఫ్టీ సర్టిఫికెట్‌ తీసుకోకుండానే తిరిగి తెరిచినట్లు స్థానిక మున్సిపల్‌ విభాగం చీఫ్‌ సందీప్‌ సిన్హ్‌ పేర్కొన్నారు. 

మోర్బీ నగరంలోని ఝూల్తా పూల్‌ (వేలాడే వంతెన)కు 7 నెలలపాటు మరమ్మతుల నిర్వహించి.. గుజరాతీ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ నెల 26న దాన్ని తిరిగి తెరిచారు. దీపావళి సెలవులకు తోడు ఆదివారం కూడా కావడంతో ఈ వంతెన వద్ద పర్యాటకుల రద్దీ బాగా కనిపించింది. వంతెనపైకి వందల మంది చేరారు. సందర్శకుల సంఖ్య మరీ ఎక్కువ కావడంతో.. అధిక బరువును మోయలేక సాయంత్రం 6:30 గంటలకు వంతెన ఒక్కసారిగా కూలిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని