Durga Puja: దుర్గామాత పూజ కోసం భారీ మండపం.. గిన్నిస్‌ బుక్‌లో చోటు..!

లఖ్‌నవూలో తాత్కాలికంగా నిర్మించిన అతి ఎత్తైన మండపం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించేందుకు సిద్ధమైంది.

Published : 05 Oct 2022 10:43 IST

లఖ్‌నవూ: దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు (Navaratri) ఘనంగా జరుగుతున్నాయి. రకరకాల ఆకృతుల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో దుర్గామాత ప్రత్యేక పూజలు (Durga Puja) అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన ఓ మండపం రికార్డు సృష్టించనుంది. లఖ్‌నవూలో తాత్కాలికంగా నిర్మించిన అతి ఎత్తైన మండపం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో (Guinness Records) చోటు సంపాదించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు కోల్‌కతాలో ఏర్పాటు చేసిన మండపమే అత్యంత ఎత్తైనదిగా రికార్డు కొనసాగుతోంది.

‘లఖ్‌నవూలోని జానకీపురంలో 136 అడుగుల ఎత్తైన భారీ దుర్గాపూజా మండపాన్ని ఏర్పాటు చేశాం. ఇందుకోసం కోల్‌కతా, అస్సాం రాష్ట్రాలకు చెందిన 52 మంది కళాకారులు నెలకు పైగా కష్టపడ్డారు. యూపీలోని బృందావన్‌లో నిర్మితమవుతున్న చంద్రోదయ ఆలయ నమూనాలో దీన్ని ఏర్పాటు చేశాం. ఈ భారీ మండపం నిర్మించేందుకు సుమారు రూ.32 లక్షలు ఖర్చయింది. నిత్యం 70 వేల మంది ఈ మండపంలోని దుర్గాదేవిని దర్శించుకుంటున్నారు. గత 28 ఏళ్లుగా ఇక్కడ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నాం’ అని దుర్గా పూజా కమిటీ నిర్వాహకులు రాకేశ్‌ పాండే వెల్లడించారు. ఇప్పటికే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ బృందం దీన్ని సందర్శించి పరిశీలించిందని, నాలుగైదు రోజుల్లో సర్టిఫికెట్‌ జారీ చేయనున్నట్లు తెలిపారు.

దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగే పశ్చిమబెంగాల్‌లో భారీ మండపాలను ఏర్పాటు చేస్తుంటారు. గతంలో అక్కడ ఏర్పాటు చేసిన 125 అడుగుల ఎత్తైన మండపమే అతిపెద్దదిగా ఇప్పటివరకు రికార్డు నమోదు చేసింది. తాజాగా యూపీలోని మండపం ఆ రికార్డును తిరగరాయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని