Uttarakhand: హిమపాతం ఘటనలో.. 14మంది ఆచూకీ లభ్యం..

ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్న భారీ హిమపాతంలో చిక్కుకుపోయిన పర్వతారోహకుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Published : 05 Oct 2022 18:14 IST

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) చోటుచేసుకున్న భారీ హిమపాతంలో చిక్కుకుపోయిన పర్వతారోహకుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌తో సహా ఇతర బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌ చేపడుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 14 మందిని సురక్షితంగా తీసుకురాగలిగారు. ఈ దుర్ఘటనలో ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు సవితా కన్స్వాల్‌ మృతి చెందినట్లు ఉత్తరకాశీ అధికారులు ధ్రువీకరించారు.

ద్రౌపదీ కా డాండా-2 పర్వత శిఖరం అధిరోహణకు ఎంతమంది పర్వతారోహకులు (Mountaineers) వెళ్లారనే విషయంపై స్పష్టత లేదు. 28 మంది ట్రెయినీ పర్వతారోహకుల ఆచూకీ లభించలేదని ఉత్తరాఖండ్‌ పోలీసులు వెల్లడించారు. 14 మంది ట్రెయినీల బృందాన్ని సురక్షితంగా బేస్‌ క్యాంపునకు తీసుకువచ్చామని చెప్పారు. మిగతా వారు డొక్రియానీ బామక్‌ మంచుపర్వతం లోయలో చిక్కుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రెయినీ పర్వతారోహకులు పశ్చిమబెంగాల్‌, దిల్లీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, అస్సాం, హరియాణా, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందినవారని తెలిపారు.

ఉత్తరకాశీలోని నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటనీరింగ్‌ (ఎన్‌ఐఎం)కు చెందిన శిక్షకులు, శిక్షణ పొందుతున్న పర్వతారోహకులు మొత్తం 42 మంది బృందం పర్వతారోహణకు వెళ్లినట్లు ఆ సంస్థ ప్రిన్సిపల్‌ కల్నల్‌ అమిత్‌ బిష్త్‌ పేర్కొన్నారు. కానీ, వాస్తవంగా వారి సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని