operation dost: ప్రాణాలు కాపాడేందుకు పరుగులు పెట్టిన ‘దోస్త్‌’

తుర్కియే(Turkey)లో ఆపరేషన్‌ దోస్త్‌ కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కొన్ని గంటల్లోనే సిద్ధమైపోయాయి. విదేశీ వ్యవహారాల శాఖ సమయాన్ని పట్టించుకోకుండా వందల కొద్దీ పేపర్లను ప్రాసెస్‌ చేసి దౌత్య ఏర్పాట్లు చేసింది. 

Updated : 22 Feb 2023 11:17 IST

ఇంటర్నెట్‌డెస్క్ : తుర్కియే(Turkey)లో భారత్‌(India) చేపట్టిన సహాయక కార్యక్రమాలు అక్కడి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. భూకంపం వచ్చి ఆ దేశం అతలాకుతలమైన తర్వాత.. చాలా వేగంగా స్పందించి సహాయక బృందాలను పంపిన దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. తుర్కియే(Turkey) భూకంపం వార్త తెలిసిన వెంటనే భారత్‌ 152 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని సిద్ధం చేసింది. ఈ బృందంలో 18 నెలల వయసున్న కవలలను ఇంటి వద్దే వదిలిన ఓ తల్లి కూడా సభ్యురాలు కావడం విశేషం. ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఆమె యూనిఫాం వేసుకొని దేశం కాని దేశానికి తరలి వెళ్లింది. అధికారులు దౌత్య నిబంధనలు పూర్తి చేయడానికి సమయం లెక్కచేయకుండా వందల కొద్దీ పత్రాలను ప్రాసెస్‌ చేశారు. అక్కడికి చేరుకొన్న భారత బృందం 10 రోజుల పాటు వేలాది మందికి సేవలు అందించి ఇటీవలే స్వదేశానికి తిరిగివచ్చింది. ఈ సందర్భంగా వారి అనుభవాలను పంచుకొన్నారు.

మొత్తం మూడు బృందాల్లో 152 మంది సభ్యులను, ఆరు జాగీలాలను అక్కడకు పంపేందుకు గంటల్లోనే సిద్ధం చేశారు. వీరిలో కేవలం కొందరికే దౌత్య పాస్‌పోర్టులు ఉన్నాయి. కోల్‌కతా, వారణాసిలోని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఫ్యాక్స్, ఈమెయిల్స్‌లో పంపిన వందల పత్రాలను విదేశాంగ శాఖ రాత్రికి రాత్రే ప్రాసెసింగ్‌ చేసింది. మరో వైపు తుర్కియే(Turkey) కూడా భారత బృందాలకు వీసా ఆన్‌ అరైవల్‌ సౌకర్యాన్ని కల్పించింది. భారత బృందాలు గజియన్‌తెప్‌ ప్రావిన్స్‌లోని నర్దాగి, హతాయ్‌ వద్దకు చేరుకొన్నాయని సెకండ్‌ ఇన్‌ కమాండెంట్‌ రాకేశ్‌ రంజన్‌ వెల్లడించారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందంలోని ఐదుగురు మహిళా సభ్యురాల్లో సుష్మా యాదవ్‌ (32) అనే కానిస్టేబుల్‌ కూడా ఉన్నారు. ఆమె తొలిసారి విదేశాల్లో విపత్తు సహాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకోసం ఆమె తన 18 నెలల కవల పిల్లలను ఇంటి వద్ద వదిలి వెళ్లారు. ఆమె అత్త పసిపిల్లల బాధ్యతలు చూసుకొన్నారు. ఈ విపత్తు సమయంలో తాము కాకపోతే ఇంకెవరు వెళతారని సుష్మా భావించారు. టర్కీలో -5 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా ఆమె ధైర్యంగా పనిచేశారు. శిథిలాల నుంచి కాపాడిన వారిని  సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచడం ఆమె బృందం విధి.

డిప్యూటీ కమాండెంట్‌ అధికారి దీపక్‌ మాట్లాడుతూ అక్కడి ప్రజలు భారత బృందం సేవలకు చలించిపోయారన్నారు. భార్య, ముగ్గురు పిల్లలను భూకంపంలో కోల్పోయిన అహ్మద్‌ అనే వ్యక్తి అక్కడ భారత బృందం వెంటే ఉన్నాడు. బృందసభ్యుల్లో శాకాహార అవసరాలు తీర్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడని దీపక్‌ గుర్తు చేసుకొన్నారు. అతడి వద్ద అందుబాటులో ఉన్న కాయగూరలతో వంటకం తయారు చేసి అందించేవాడని వెల్లడించారు. భారత బృందంతో అక్కడి ప్రజలు ప్రత్యేక అనుబంధం పెంచుకొన్నారని చెప్పారు. 

తుర్కియే(Turkey)లో భవనాలు నిట్టనిలువునా కూలడంతో శిథిలాలను తొలగించడం అత్యంత క్లిష్టమైన పని. ఈ స్థితిలో కూడా భారత బృందం ఇద్దరు బాలికలను శిథిలాల అడుగు నుంచి రక్షించింది.  దీంతోపాటు 85 మృతదేహాలను వెలికి తీసింది. ఈ బృందం ఇటీవలే భారత్‌ చేరుకోగా.. ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని నివాసంలో వారికి ఆతిథ్యం ఇచ్చారు. ఇక భారత సైన్యం అక్కడ వైద్యశాలను ఏర్పాటు చేసి వేల మందికి చికిత్సను అందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని