China: చైనాలో వర్ష బీభత్సం.. 780 మిలియన్‌ డాలర్ల నష్టం; 15మంది మృతి!

చైనాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఆ దేశానికి భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఉత్తర చైనాలోని షాంక్సీ ప్రావిన్స్‌లో.........

Published : 12 Oct 2021 18:49 IST

బీజింగ్‌: చైనాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఆ దేశానికి భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఉత్తర చైనాలోని షాంక్సీ ప్రావిన్స్‌లో ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలకు 15 మంది మృతి చెందగా.. ముగ్గురు గల్లంతైనట్టు అధికారులు వెల్లడించారు. వరద ముంపు నేపథ్యంలో ఆ ప్రావిన్స్‌లోని దాదాపు 1.20లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు పేర్కొన్నారు. అక్టోబర్‌ 2నుంచి 7వరకు రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి దాదాపు 10లక్షల మందికి పైగా జనం ప్రభావితమైనట్టు అధికారులు తెలిపారు. ఈ వర్షాలకు 2,36,460 హెక్టార్లలో పంటలు నాశనం కావడంతో పాటు 37,700 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అలాగే, 6021 కి.మీల మేర రహదారులు కూడా దెబ్బతిన్నాయి. దీంతో చైనాకు 780 మిలియన్‌ డాలర్ల మేర ప్రత్యక్షంగా ఆర్థికనష్టం వాటిల్లినట్టు చైనా అధికార మీడియా సంస్థ జిన్హువా పేర్కొంది. 

శుష్క ప్రాంతంగా ఉన్న షాంక్సీ ప్రావిన్స్‌లో నెల ప్రారంభంలో కురిసే సాధారణ వర్షపాతం కన్నా ఐదు రెట్లు ఎక్కువగా నమోదు కావడంతో పలు ఆనకట్టలు, రైల్వే లైన్లు దెబ్బతిన్నాయని తెలిపింది. ప్రధానంగా బొగ్గు ఉత్పత్తి కేంద్రంగా ఉండే ఈ ప్రాంతంలో 60 బొగ్గు గనులు మూతపడ్డాయి. ప్రస్తుతం విద్యుత్‌ కోతలతో సతమతమవుతున్న ఈ గనులు మూతపడటంతో ఇంధన సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల నిమిత్తం అధికారులు 7.8 మిలియన్ డాలర్ల మొత్తాన్ని కేటాయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని