Cases increase: దిల్లీలో ఒక్క రోజులోనే 41% పెరిగిన కొవిడ్‌ కేసులు

దేశ రాజధాని దిల్లీలో గురువారం 15,097 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.బుధవారం నమోదైన కేసులతో పోలిస్తే ఒక్క...

Updated : 13 May 2022 11:55 IST

రోగులతో నిండుతున్న ఆక్సిజన్‌ పడకలు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో గురువారం 15,097 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. బుధవారం నమోదైన కేసులతో పోలిస్తే ఒక్క రోజులోనే 41.5శాతం మేర కేసులు పెరిగాయి. గతేడాది మే 8 తర్వాత తిరిగి అత్యధికంగా ఆస్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఎనిమిది నెలల విరామం తర్వాత బుధవారం అత్యధికంగా 10,665 కేసులు నమోదు కాగా.. మరుసటి రోజున 41శాతం మేర కేసులు పెరగడం గమనార్హం. పాజిటివిటీ రేటు 15శాతం దాటినట్లు, మరో ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కొవిడ్‌ మహమ్మారికి తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో ఒకటైన దిల్లీలో గత కొద్ది రోజులుగా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావంతో ఇంత భారీగా కేసులు వస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఓ వైపు అత్యధికంగా కేసులు నమోదవుతుండగా ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం దిల్లీలోని ఆస్పత్రుల్లో ఈనెల 1న 247మంది రోగులు ఉండగా 4నాటికి ఆ సంఖ్య 531కి చేరిందని అధికారులు వెల్లడించారు. గడిచిన మూడు రోజుల్లో ఆక్సిజన్‌ సపోర్టుతో ఉన్న రోగుల సంఖ్య 94నుంచి 168లకు, వెంటిలేటర్ సపోర్ట్‌తో ఉన్న వారి సంఖ్య 4నుంచి 14కి పెరిగినట్లు వివరించారు. 

అవసరమవుతున్న ఆక్సిజన్‌ పడకలు

దిల్లీలోని 12,104 ఆక్సిజన్‌ పడకలకు గాను ఇప్పటివరకు 1,116 పడకలు కొవిడ్‌ రోగులతో నిండినట్లు అధికారులు తెలిపారు. దిల్లీలో గురువారం దాదాపు 14వేల కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ ఉదయం వెల్లడించారు. అయితే దిల్లీలో లాక్‌డౌన్‌కు సంబంధించిన అవకాశాలను మంత్రి తోసిపుచ్చారు. కొవిడ్‌ పరీక్షలను పెంచడంవల్లే అధికంగా కేసులు బయటపడుతున్నాయన్నారు. దేశంలోనే దిల్లీలో అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు దిల్లీ ప్రజలకు భరోసా ఇచ్చిన మంత్రి పడకల సామర్థ్యం విషయంలోనూ మెరుగ్గా ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వెయ్యి మంది రోగుల్లో ఒకరు మాత్రమే మరణిస్తున్నారని, సెకండ్‌ వేవ్‌ కంటే పరిస్థతి మెరుగ్గా ఉన్నట్లు తెలిపారు. బుధవారం 9వేల ఉచిత పడకలు అందుబాటులో ఉండగా నేడు వాటిని 12వేలకు పెంచినట్లు తెలిపారు. రోజుకు 90వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోజుకు లక్ష కరోనా కేసులు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తాజాగా సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. దిల్లీలో ప్రస్తుతం 14,937మంది రోగులు హోం ఐసోలేషన్‌లో ఉండగా రికవరీ రేటు 96.19శాతంగా ఉందని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని