Corona: ముంబయిలో కరోనా కల్లోలం.. 159మంది ప్రభుత్వ వైద్యులకు పాజిటివ్‌!

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కరోనా మళ్లీ కల్లోలం రేపుతోంది. బుధవారం ఒక్కరోజే 15,166 కొత్త కేసులు వెలుగుచూడటం.....

Published : 05 Jan 2022 20:49 IST

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కరోనా మళ్లీ కల్లోలం రేపుతోంది. బుధవారం ఒక్కరోజే 15,166 కొత్త కేసులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పట్నుంచి ఇప్పటిదాకా ఒకేరోజు ఇంత భారీగా పాజిటివ్‌ కేసులు రావడం ఇదే తొలిసారి. నిన్నటితో పోలిస్తే 39శాతం మేర కేసులు జంప్‌ అయ్యాయి. మరోవైపు, కరోనాపై పోరాటంలో ముందు వరుసలో నిలబడి రోగులకు చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్యులు ఈ మహమ్మారి బారినపడుతుండటం కలకలం రేపుతోంది. గత మూడు రోజుల్లోనే ముంబయిలోని ప్రభుత్వ ఆస్పత్రులకు చెందిన 159మంది రెసిడెంట్‌ వైద్యులు కరోనా బారినపడినట్టు రెసిడెంట్‌ వైద్యుల సంఘం ప్రతినిధి గణేశ్‌ సోలంకే తెలిపారు. సెంట్రల్‌ ముంబయిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 72గంటల వ్యవధిలోనే దాదాపు 160మంది రెసిడెంట్‌ ఫిజీషియన్లు కరోనా బారినపడ్డారన్నారు. వీరిలో 40మంది కింగ్‌ ఎడ్వర్డ్‌ మెమోరియల్‌ ఆస్పత్రికి చెందినవారు కాగా.. 50మంది లోకమాన్య తిలక్‌ మున్సిపల్‌ జనరల్‌ ఆస్పత్రి నుంచి, మరో ఎనిమిది మంది ఆర్‌ఎన్‌ కూపర్‌ ఆస్పత్రికి చెందినవారు ఉన్నారన్నారు. ఈ ఆస్పత్రులు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్వహణలో ఉన్నాయని చెప్పారు. అలాగే, ఠాణే పరిధిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఆస్పత్రిలో ఎనిమిది మంది వైద్యులకు ఈ మహమ్మారి సోకినట్టు పేర్కొన్నారు.


మద్రాస్‌ ఎంఐటీలో 46, కర్ణాటకలో 21 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్‌

విద్యాసంస్థల్లో బయటపడుతున్న పాజిటివ్‌ కేసులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ విద్యాసంస్థల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా క్యాంపస్‌లు‌, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు మహమ్మారి బారిన పడుతున్నారు. ఒకరిద్దరికి పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో ఇతర విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా కొందరికి ఎటువంటి లక్షణాలు లేకపోయినా వారికి కరోనా సోకినట్లు నిర్ధారిస్తున్నారు. ఎక్కువగా లక్షణాలు లేని కేసులు వెలుగుచూస్తున్నాయి. చెన్నై క్రోంపేటలోని మద్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో (ఎంఐటీ)46మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. తమిళనాట రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 2,731 కేసులు నమోదుకాగా, 9 మంది మృతిచెందారు. ఈనేపథ్యంలో చెన్నై సహా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షల్ని అధికం చేశారు. ఈనేపథ్యంలో ఎంఐటీలోని విద్యార్థుల్లో ఎక్కువ మంది జ్వరాల బారిన పడటంతో  1,417మందికి పరీక్షలు నిర్వహించగా 46 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మరికొందరి శాంపిల్‌ ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. 46మందిలో 33మందిని కళాశాలలో ఐసోలేషన్‌లో ఉంచినట్లు, 13మందిని హోమ్‌ ఐసోలేషన్‌కు పంపినట్లు తెలిపారు.కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. 46 శాంపిళ్లను ఒమిక్రాన్‌ వేరియంట్‌ నిర్ధారణ కోసం పంపినట్లు తెలిపారు.ఎంఐటీకి వారం పాటు సెలవులు ప్రకటించారు. ప్రముఖ విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెన్నై, చెంగల్‌పట్టు జిల్లా కలెక్టర్లు తెలిపారు.

250 శాంపిళ్లలో 21 కేసులు

బెంగళూరులోని విజయనగర్‌ మెడికల్‌ కాలేజీలో (విమ్స్‌) 21మంది వైద్యవిద్యార్థులకు కోవిడ్‌ పాజిటివ్‌గా కళాశాల డైరెక్టర్‌ గంగాధర్‌ గౌడ తెలిపారు. వీరందరూ ఎంబీబీఎస్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు వెల్లడించారు. హాస్టల్‌లో ఉంటున్న 250 మంది విద్యార్థులకు రాన్‌డమ్‌గా పరీక్షలు నిర్వహించగా 21మందికి పాజిటివ్‌గా తేలిందని వీరందరినీ చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు.

గౌహతి ఐఐటీలో 50 మందికి

గౌహతిలోని ఐఐటీలో గత ఆరు రోజుల్లో విద్యార్థులు, అధ్యాపకులు సహా 50మందికి కరోనా సోకినట్లు ఐఐటీ వర్గాలు బుధవారం తెలిపాయి. పాజిటివ్‌ కేసుల నేపథ్యంలో నిబంధనలు కఠినతరం చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. 99శాతం కేసులు సెలవుల తర్వాత ఇతర ప్రాంతాల నుంచి అస్సాంకు వచ్చిన వారిలో బయటపడ్డాయని ఐఐటీ డీన్‌ పరమేశ్వర్‌ అయ్యర్‌ తెలిపారు. డిసెంబర్‌ 31 తర్వాత పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అధ్యాపకుడి సహా వారి కుటుంబ సభ్యులు ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా కోవిడ్‌ నిర్ధారణ అయిన మిగిలిన వారందరూ విద్యార్థులేనని వెల్లడించారు.

► Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని