Kota: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 11వ ఘటన

పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన‘కోటా(Kota)కు పొరుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది విద్యార్థులు వస్తుంటారు. అయితే, అక్కడ వరుసగా చోటుచేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకరంగా మారాయి. 

Published : 16 Jun 2024 16:24 IST

కోటా: రాజస్థాన్‌(Rajasthan)లోని కోటా(Kota)లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు(Suicides) కలవరపెడుతున్నాయి. ఐఐటీ-జేఈఈకి సిద్ధమవుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఇది 11వ మరణం కావడం ఆందోళన కలిగిస్తోంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిహార్‌లోని మోతీహారీకి చెందిన ఆయుష్ జైస్వాల్(17) గత రెండేళ్లుగా సామ్రాట్‌ చౌక్‌ ప్రాంతంలో ఉంటూ..ఐఐటీ-జేఈఈకి సిద్ధమవుతున్నాడు. శనివారం రాత్రి అతడు గది బయటకు రాకపోవడంతో స్నేహితులు అద్దె ఇంటి యజమానికి తెలియజేశారు. ఎన్ని సార్లు పిలిచినా ఆయుష్‌ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన యజమాని పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని తలుపులు పగలగొట్టి చూడగా గదిలో ఉరివేసుకుని కనిపించాడు. పోలీసులు ఆ విద్యార్థిని వెంటనే న్యూ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గదిలో ఎటువంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అతడి కుటుంబానికి సమాచారం ఇచ్చామని.. వారు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు

వివిధ పోటీపరీక్షల కోచింగ్‌ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన కోటాలో విద్యార్థులు ఒత్తిడి కారణంగానే బలవన్మరణాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆత్మహత్యలు తగ్గించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అక్కడి విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంచింది. అయినా ఆత్మహత్యలు తగ్గట్లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని