Manipur Violence: హింసా కాండకు 60మంది బలి.. 1700 ఇళ్లు దహనం: సీఎం వెల్లడి

మణిపూర్‌ (Manipur)లో చెలరేగిన హింసాకాండలో ఇప్పటివరకు 60 మంది మృతి చెందారని ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ (Biren Singh) వెల్లడించారు. 

Published : 08 May 2023 23:02 IST

ఇంఫాల్: ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ (Manipur) అట్టుడికిన విషయం తెలిసిందే. మెజార్టీ ‘మెయితీ (Metei)’ కమ్యూనిటీని షెడ్యూల్‌ తెగలో చేర్చే చర్యల్ని వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనల్లో మొత్తం 60 మంది మృతి చెందినట్లు ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ (Biren Singh) వెల్లడించారు. మొత్తం 1700 ఇళ్లు దహనం అయినట్లు తెలిపారు. 231 మంది గాయపడ్డారన్నారు. సోమవారం వరకు 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఇంకా 10 వేల మందిని తరలించాల్సి ఉందని వివరించారు.

‘రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. స్థానికంగా చిక్కుకుపోయిన ప్రజలను వారి వారి ప్రాంతాలకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారందరికీ అవసరమైన సాయం అందిస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్ర పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు’ అని సీఎం బీరెన్ సింగ్ తెలిపారు. మరోవైపు.. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో సోమవారం ఉదయం కొన్ని గంటలపాటు కర్ఫ్యూను సడలించారు. దీంతో కాస్త సాధారణ పరిస్థితులు కనిపించాయి.

మణిపూర్‌లో ప్రాణ, ఆస్తి నష్టంపై సోమవారం ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు.. స్థానికంగా ప్రార్థనా స్థలాలను పరిరక్షించడంతోపాటు బాధితులకు సహాయ, పునరావాస చర్యలను వేగవంతం చేయాలని కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను మే 17కి వాయిదా వేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 23 వేల మందికి సైనిక శిబిరాల్లో ఆశ్రయం కల్పించారు. శాంతిభద్రతల పరిరక్షణకు భద్రతా బలగాలను విస్తృతంగా మోహరించడంతోపాటు పరిస్థితిని పర్యవేక్షించేందుకు హెలికాప్టర్లు, డ్రోన్‌లను వినియోగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని