Corona: కరోనా మళ్లీ బీభత్సం.. 180మందికి పైగా వైద్యులకు పాజిటివ్‌

దేశంలో కొవిడ్‌ మహమ్మారి మళ్లీ బీభత్సం సృష్టిస్తోంది. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు కరోనా సెకండ్‌ వేవ్‌ నాటి రోజుల్ని గుర్తు చేస్తున్నాయి.......

Updated : 03 Jan 2022 16:18 IST

కోల్‌కతా/పట్నా: దేశంలో కొవిడ్‌ మహమ్మారి మళ్లీ బీభత్సం సృష్టిస్తోంది. ఒమిక్రాన్‌ విజృంభిస్తున్న వేళ రోజురోజుకీ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు కరోనా సెకండ్‌ వేవ్‌ నాటి రోజుల్ని గుర్తు చేస్తున్నాయి. తాజాగా పశ్చిమబెంగాల్‌, బిహార్‌లలో 180మందికి పైగా వైద్యులు కరోనా బారినపడటం కలకలం రేపుతోంది. గడిచిన 24గంటల వ్యవధిలో పశ్చిమబెంగాల్‌లోని మూడు వేర్వేరు ఆస్పత్రులకు చెందిన 100 మందికి పైగా వైద్యులు కరోనా బారిన పడినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో 70మంది వైద్యులు కలకత్తా జాతీయ వైద్య కళాశాల, ఆస్పత్రికి చెందినవారు కాగా.. 24మంది చిత్తరంజన్‌ సేవా సదన్‌కు చెందిన వైద్యులు ఉన్నారు. అలాగే, రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆప్తమాలజీకి చెందిన 12మంది వైద్యులకు కూడా ఈ మహమ్మారి సోకినట్టు తెలిపారు. వీరందరినీ సంస్థాగత క్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్టు అధికారులు పేర్కొన్నారు. కాంటాక్టు ట్రేసింగ్‌ ప్రారంభించామనీ.. ఈ మూడు ఆస్పత్రుల్లోని ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. 

పట్నా నలంద ఆస్పత్రిలో 87మంది వైద్యులకు..
మరోవైపు, బిహార్‌ పట్నాలో నలంద వైద్య కళాశాల, ఆస్పత్రికి చెందిన 87మంది వైద్యులు కరోనా బారినపడ్డారు. బాధితుల్లో చాలామందికి లక్షణాల్లేవన్న అధికారులు.. మరికొంతమంది తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నట్టు చెప్పారు. బాధితులను ఆస్పత్రిలోని క్యాంపస్‌లో ఐసోలేషన్‌లో ఉంచినట్టు పట్నా కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సింగ్‌ తెలిపారు.  వీరిలో ఐదుగురిని మాత్రం ఆసపత్రిలో చేర్చినట్టు వెల్లడించారు. వీరంతా ఇటీవల పట్నాలో జరిగిన భారతీయ వైద్యుల సంఘం (ఐఎంఏ) 96వ వార్షిక సదస్సుకు హాజరైనట్టు అధికారులు తెలిపారు. గత వారంలో జరిగిన ఈ సదస్సుకు బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ సహా పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.

Read latest National - International News and Telugu News


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts