పాక్‌కు మరోసారి చుక్కెదురు!

పాకిస్తాన్‌ వైమానిక రంగానికి ఓ పెద్ద విఘాతం తగలనుంది.

Published : 09 Nov 2020 19:21 IST

పాక్‌ విమానాలపై 188 దేశాల వేటు..!

ఇస్లామాబాద్‌: నిర్దేశిత అంతర్జాతీయ ప్రమాణాల అమలులో విఫలమైన పాక్‌ వైమానిక సేవలపై.. 188 ప్రపంచ దేశాలు వేటువేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పాక్‌లో చోటుచేసుకున్న లైసెన్సు కుంభకోణం నేపథ్యంలో పాకిస్థాన్‌‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ)ను  బ్రిటన్‌, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు ఇప్పటికే నిషేధించిన సంగతి తెలిసిందే.

పాక్‌ పైలట్లలో 30 శాతానికి పైగా విమానాలు నడిపేందుకు అర్హత లేనివారేనని.. వారిలో మూడింట ఒకరివి నకిలీ లైసెన్సులని పాక్‌ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్‌ ఖాన్‌ జూన్‌లో స్వయంగా ప్రకటించారు. పీఐఏకు చెందిన 141 మందితో సహా 262 మంది పాక్‌ పైలట్లు నకిలీ ధృవపత్రాలు సమర్పించినట్లు ఆయన తెలిపారు. అదే నెలలో వంద మందిని పొట్టన పెట్టుకున్న కరాచీ విమాన ప్రమాదానికి కూడా పైలట్ల నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.

విమాన ప్రయాణికుల భద్రతకు గాను అంతర్జాతీయ సంస్థ ‘ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌’ (ఐసీఏఓ) ఓ సురక్షితా విధానాన్ని ఆమోదించింది. ఈ ప్రమాణాలను పాటించటంలో విఫలమైన ‘పాకిస్థాన్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ’కి ఆ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. పైలట్ల  లైసెన్సులు, శిక్షణ తదితర విషయాల్లో, అంతర్జాతీయ ప్రమాణాలను పాటించటంలో పాక్‌ విఫలమైనట్లు ఈ మేరకు విడుదల చేసిన ఓ లేఖలో ఐసీఏఓ వివరించింది. ఈ నేపథ్యంలో 188 ప్రపంచ దేశాలు పాక్‌ విమానాలను, పైలట్లను నిషేధించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, ప్రపంచ దేశాల నిర్ణయం పాక్‌ విమానయాన రంగానికే గొడ్డలి పెట్టు అని పాకిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. విమానయాన వ్యవస్థపై తాము చేసిన పలు విజ్ఞప్తులను పాక్‌ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఇకనైనా ఈ విషయంలో జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రత్యేక టాస్క్‌ ఫోర్సును ఏర్పాటు చేయాలని వారు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని