ఆ మరణాలు వ్యాక్సిన్‌ వల్ల సంభవించలేదు

వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా 19 మంది మరణించినట్లు చెప్తున్న ఘటనల్లో ఆధారాలు లేవని కేంద్రం తెలిపింది. ఆ మరణాలు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సంభవిచలేదని వెల్లడించింది.

Published : 09 Feb 2021 21:11 IST

రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం

దిల్లీ: వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా 19 మంది మరణించినట్లు చెప్తున్న ఘటనల్లో ఆధారాలు లేవని కేంద్రం తెలిపింది. ఆ మరణాలు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సంభవించలేదని వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వని కుమార్ చౌబే తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎందరికి తీవ్ర దుష్ప్రభావాలు ఎదురయ్యాయి? అని రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ‘‘ దేశవ్యాప్తంగా జనవరి 16న వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తర్వాత స్వల్ప దుష్ప్రభావాలు ఎదురై 25 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇది మొత్తం వ్యాక్సిన్‌ తీసుకున్నవారితో పోలిస్తే 0.0005శాతం మాత్రమే. కొందరికి చిన్న చిన్న సమస్యలు ఎదురైనా అవి సాధారణమే. కొవాగ్జిన్‌ తీసుకున్న వారిలో 81 మందికి, కొవిషీల్డ్‌ తీసుకున్నవారిలో 8,402 మందికి స్వల్ప సమస్యలు ఎదురయ్యాయి. ఇవన్నీ ఏ టీకా తీసుకున్న తర్వాతైనా వచ్చే ఆందోళన, జ్వరం, అలసట, దద్దుర్లు, తలనొప్పి వంటివే. అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి ఉద్దేశించిన టీకాలు వేస్తే ఇవన్నీ సాధారణంగా వస్తాయి. ఈ సమస్యలు వచ్చిన వారిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాం.’’ అని మంత్రి తెలిపారు.

వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, అసత్య ప్రచారాన్ని అడ్డుకొనేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించామని మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌, సౌదీ అరేబియా, మొరాకో, మయన్మార్‌, నేపాల్‌, ఆఫ్ఘనిస్తాన్‌, శ్రీలంక, భూటాన్‌, మాల్దీవులు, ఒమన్‌, బహ్రెయిన్‌, మారిషస్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, మంగోలియా దేశాలకు వ్యాక్సిన్‌ ఎగుమతుల పంపిణీ పూర్తైందని మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు.

ఇవీ చదవండి..

భారత హెచ్చరికలపై స్పందించిన ట్విటర్‌

ఉద్యమ కేంద్రంలోనే ఉపద్రవం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని