Longewala: భారత్‌-పాక్‌ యుద్ధం.. ‘లోంగేవాలా హీరో’ కన్నుమూత

1971లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన యుద్ధంలో లోంగేవాలా ఘటన కీలకమైనదిగా నిలిచింది. ఆ సమయంలో లోంగేవాలా హీరోగా పేరుతెచ్చుకున్న భైరాన్‌ సింగ్‌ రాథోడ్‌ (81) నేడు కన్నుమూశారు. జోధ్‌పుర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ  తుదిశ్వాస విడిచిన ఆయనకు.. బీఎస్‌ఎఫ్‌ కూడా శ్రద్ధాంజలి ఘటించింది.

Updated : 19 Dec 2022 20:30 IST

దిల్లీ: 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో (India-Pakistan War) లోంగేవాలా (Longewala) పోస్టు వద్ద జరిగిన పోరు చరిత్రలో నిలిచిపోయింది. నాటి యుద్ధంలో ‘లోంగేవాలా హీరో’గా పేరు తెచ్చుకున్న మాజీ సైనికుడు భైరాన్‌ సింగ్‌ రాథోడ్‌ (81) నేడు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో జోధ్‌పుర్‌లోని ఎయిమ్స్‌లో చికిత్స పొందిన ఆయన.. సోమవారం తుదిశ్వాస విడిచినట్లు బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF)తోపాటు రాథోడ్‌ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ధైర్య సాహసాలు, విధుల పట్ల అంకితభావం కలిగిన వ్యక్తి రాథోడ్‌ అని కొనియాడుతూ బీఎస్‌ఎఫ్‌ అధికారులు ట్వీట్‌ చేశారు. జోధ్‌పుర్‌కు 120 కి.మీ దూరంలో ఉన్న సోలంకియాటాలా గ్రామంలో రాథోడ్‌ కుటుంబం నివసిస్తోంది.

1971లో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య యుద్ధం (India-Pakistan War) జరిగింది. ఆ సమయంలో రాజస్థాన్‌లోని థార్‌ ఎడారి (Thar Desert)లో ఉన్న లోంగేవాలా పోస్టు (Longewala Post)పై పాకిస్థాన్‌ బలగాలు దాడి చేశాయి. ఆ పోస్టు వద్ద పంజాబ్‌ రెజిమెంట్‌కు చెందిన చిన్న బృందంతోపాటు బీఎస్‌ఎఫ్‌ యూనిట్‌కు భైరాన్‌ సింగ్‌ రాథోడ్‌ నాయకత్వం వహించారు. వేల మంది పాక్‌ సైనికులు యుద్ధ ట్యాంకులతో దండెత్తగా.. భారత్‌ వైపు కేవలం 120 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. లోంగేవాలా పోస్టుపై పాక్‌ సైనికులు జరిపిన దాడిలో పంజాబ్‌ రెజిమెంట్‌కు చెందిన ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. దాంతో వెంటనే స్పందించిన లాన్స్‌ నాయక్‌ భైరాన్‌ సింగ్‌.. తేలికపాటి మెషిన్‌ గన్‌తో దాడి చేస్తూ శత్రువులకు భారీ ప్రాణ నష్టాన్ని కలిగించారు. భారత వాయు సేన రంగంలోకి దిగేవరకూ శత్రువుతో పోరాడిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. అనంతరం బీఎస్‌ఎఫ్‌కు తోడుగా వైమానిక దళం నిలవడంతో పాక్‌ సైన్యాన్ని మట్టికరిపించారు.

లోంగేవాలా (Longewala) పోస్టు వద్ద జరిగిన యుద్ధంలో ‘చంపడమో లేదా చావడమో’ అనే నినాదంతో ముందుకెళ్లిన భైరాన్‌ సింగ్‌ రాథోడ్‌ చేసిన సాహసం సహచరులకు ఎంతో ప్రేరణగా నిలిచింది. లోంగేవాలా హీరోగా మారిన రాథోడ్‌ సాహసోపేతమైన చర్యకు  1972లో సేవా పతకాన్ని (Sena Medal) అందుకున్నారు. అనంతరం 1987లో బీఎస్‌ఎఫ్‌ నుంచి పదవీ విరమణ చేశారు. లోంగేవాలా పోస్టులో జరిగిన యుద్ధం ఇతివృత్తంతో ‘బోర్డర్‌’ అనే సినిమా (Border Movie) కూడా వచ్చింది. అందులో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టీ , భైరాన్‌ సింగ్‌ రాథోడ్‌ మరణంపట్ల సంతాపం తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని