Vijay Diwas: 93వేల మంది పాకిస్థాన్‌ సైన్యం.. భారత్‌ ముందు లొంగిపోయిన వేళ!

1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత సాయుధ బలగాలు చూపిన తెగువ ఎనలేనిదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. విజయ్‌ దివస్‌ సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించిన ఆయన.. నాటి యుద్ధం క్రూరత్వంపై మానవత్వం సాధించిన విజయమని అన్నారు.

Published : 16 Dec 2022 14:33 IST

దిల్లీ: 1971లో జరిగిన యుద్ధం (India-Pakistan) అమానుషత్వంపై మానవీయత, అన్యాయంపై న్యాయం సాధించిన విజయమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) పేర్కొన్నారు. పాకిస్థాన్‌పై భారత్‌ విజయాన్ని పురస్కరించుకొని ‘విజయ్‌ దివస్‌’ (Vijay Diwas) సందర్భంగా కేంద్ర మంత్రి ఈ విధంగా మాట్లాడారు. 1970వ దశకంలో పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధం బంగ్లాదేశ్‌ అవతరణకు (Bangladesh) దారితీసిన సంగతి తెలిసిందే.

‘అసమాన ధైర్యం, శౌర్యపరాక్రమాలు, త్యాగవీరులైన సాయుధ బలగాలకు దేశం మొత్తం ఘన నివాళి అర్పిస్తోంది. 1971లో జరిగిన యుద్ధం క్రూరత్వంపై మానవత్వం,  దుష్ప్రవర్తనపై ధైర్యం, అన్యాయంపై న్యాయం సాధించిన విజయం. సాయుధ బలగాలను చూసి యావత్‌ దేశం గర్వపడుతోంది’ అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. యుద్ధంలో అమరులైన జవాన్లకు ట్విటర్‌ ద్వారా నివాళులు అర్పించిన విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జయశంకర్‌.. సైన్యం సేవలు, త్యాగాలను కొనియాడారు. విజయ్‌ దివస్‌ సందర్భంగా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ‘ఎట్‌ హోం’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాన మంత్రితో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ (Pakistan) నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి  కల్పించడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషించింది. 1971లో తూర్పు పాకిస్థాన్‌లో మొదలైన స్వాతంత్య్ర పోరు భారత్‌-పాక్ మధ్య యుద్ధానికి దారి తీసింది. చివరకు భారత సైన్యం పాక్‌ను ఓడించి, బంగ్లాదేశ్‌ అవతరణకు అండగా నిలిచింది. ఈ సమయంలో సుమారు 93వేల పాకిస్థాన్‌ సైనికులు భారత సాయుధ బలగాల ముందు లొంగిపోయారు. ఆ విజయానికి గుర్తుగా భారత్‌లో ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్‌ను నిర్వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని